Monday, June 5, 2023
Monday, June 5, 2023

గవర్నర్‌ వ్యవస్థ రద్దు కావాలి

. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి
. సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం

న్యూదిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగ నిర్దేశిత అధికారాల సమతుల్యతను గవర్నర్‌ వ్యవస్థ దెబ్బతీసేలా ఉందని, అందువల్ల ఈ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించిన ప్రైవేట్‌ సభ్యుడి బిల్లును రాజ్యసభకు సమర్పించినట్లు ఆయన తెలిపారు. వినయ్‌ విశ్వం దిల్లీలోని అజయ్‌భవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రజలతో ఎన్నిక కానటువంటి గవర్నరుకు…ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో పరిధికి మించి తలదూర్చే అధికారం ఉండరాదని వినయ్‌ విశ్వం నొక్కిచెప్పారు. గవర్నర్‌ వ్యవస్థ అన్నది వలసవాద వారసత్వమని, బ్రిటిషర్లు నేర్పిన పద్ధతని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల న్యాయమైన ప్రజాస్వామ్యబద్ధ ఆకాంక్షలు అణచివేసే ఉద్దేశంతో గవర్నర్‌ వ్యవస్థ ఏర్పాటైందని గుర్తుచేశారు. అందువల్ల రాజ్యాంగాన్ని సవరించాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ‘కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌లలో ఎన్నికైన ప్రజాప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్లు మితిమీరి జోక్యం చేసుకోవడాన్ని మనం చూశాం. రోజువారీ పరిపాలన వ్యవహారాల్లో తలదూర్చడాన్ని గమనించాం. అసెంబ్లీలు ఆమోదించే బిల్లులకు ఆమోదం తెలపకుండా తీవ్ర జాప్యం చేయడాన్ని చూశాం. కర్నాటక, అరుణాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్‌ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వాలు కూల్చివేయడం గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ ప్రమాదకర ధోరణులను సూచిస్తున్నాయి’ అని విశ్వం అన్నారు. ‘రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏదేని బిల్లు గవర్నర్‌ వద్దకు వెళ్లినప్పుడు తాత్సారం చేయకుండా నిర్దేశిత కాలపరిమితిలో దానిని ఆమోదించే పద్ధతి కోసం తమిళనాడు ప్రభుత్వం రెండవసారి తీర్మానించాల్సి వచ్చింది. ఈ తీర్మానానికి కేరళతో పాటు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతిచ్చాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తొత్తుల్లా గవర్నర్లు వ్యవహరించడాన్ని దుయ్యబట్టాయి. సహకార సమాఖ్యకు గవర్నర్‌ వ్యవస్థ విరుద్ధం’ అని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక సమాఖ్య సూత్రాన్ని భారత్‌ అనుసరిస్తోందని, ప్రభుత్వంలో వివిధస్థాయిల్లో, వ్యవస్థల్లో పని విభజన ఉంటుందని వినయ్‌ విశ్వం గుర్తుచేశారు. కేంద్రం`రాష్ట్రం మధ్య బంధాలను రాజ్యాంగం స్పష్టం చేసిందన్నారు. వైవిధ్యభరిత భారతంలో ప్రజల ఆకాంక్షల దృష్ట్యా సమాఖ్య వ్యవస్థను రాజ్యాంగ నిర్మాతలు నిర్వహించారు గానీ ఇదే వైవిధ్యతకు ఆర్‌ఎస్‌ఎస్‌ తూట్లు పొడుస్తోందని, హిందీ, హిందూ, హిందుస్తాన్‌ అంటూ సాంస్కృతిక, భాషాపరమైన, ప్రాంతీయ వైవిధ్యతను అంతం చేయాలని చూస్తోందని విశ్వం విమర్శించారు. ఈ లక్ష్య సాధన కోసం అధికారం మొత్తం తమ వద్దనే కేంద్రీకృతమై ఉండాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని, అందుకే గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ట్రాల అధికారాలను హరిస్తోందని, ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజ్యాంగ నిపుణులు, వ్యాఖ్యాతలు, ప్రజాస్వామ్య అనుకూల వర్గాలన్నీ భారతదేశ ఫెడరల్‌ వ్యవస్థపై గవర్నర్‌ వ్యవస్థను భారమైనదిగా అభివర్ణించినట్లు వినయ్‌ విశ్వం తెలిపారు.
అధికారాన్ని కేంద్రీకృతం చేసుకొని నిరంకుశంగా, నియంతలా పరిపాలన సాగించాలనే పద్ధతిని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. గవర్నర్‌ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చివేసి అధికారాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. అలంకరణగా ఉన్న గవర్నర్‌ వ్యవస్థ రద్దుకు డిమాండ్‌ పెరుగుతోందన్నారు. విజయవాడలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. గవర్నర్‌ వ్యవస్థ రద్దు కోసం ప్రజాస్వామ్య`సమాఖ్య శక్తులు ఏకం కావాలని మహాసభ పిలుపు ఇచ్చిందన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక, ఫెడరల్‌ స్ఫూర్తి పరిరక్షణ దిశగా పార్లమెంటులో సమర్పించిన ఈ బిల్లు ఓ ముందడుగని వినయ్‌ విశ్వం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img