Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

గిరిజన ప్రాంతాలపై నాటి పాలకుల శీతకన్ను

కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు
అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో సుదీర్ఘకాలం అధికారం చెలాయించిన నేతలు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదని పరోక్షంగా కాంగ్రెస్‌ను నిందించారు. ఓట్ల కోసం లేదా ఎన్నికల్లో విజయం కోసమో తాము అభివృద్ధి పనులు చేయడం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. నవసరి జిల్లాలో గిరిజన ప్రాంతం ఖుద్వేల్‌లో రూ.3,050 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గుజరాత్‌ గౌరవ్‌ అభియాన్‌ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఇప్పటి వరకు దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ కాలం పనిచేసిందని, అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని మోదీ విమర్శించారు. గతంలో ప్రచారాలు, వాక్సినేషన్‌ వంటి కార్యక్రమాలకు గిరిజనులు నివసించే అటవీ ప్రాంతానికి చేరడానికి కొన్ని నెలలు పట్టేదని, ఇప్పుడు పట్టణ ప్రాంతాలతో సమానంగా ప్రభుత్వ పథకాలు అటవీ ప్రాంతానికి చేరుతున్నాయని ఆయన వివరించారు. ‘కరోనా వైరస్‌ కట్టడికి టీకాలు మీకు ఉచితంగా అందాయా లేదా’ అని ర్యాలీకి హాజరైన ప్రజలను మోదీ ప్రశ్నించారు. తమకు అందాయని వారు సమాధానం చెప్పారు. గడచిన రెండు దశాబ్దాలలో గుజరాత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని మోదీ వ్యాఖ్యానించారు.
గడచిన 8 ఏళ్లుగా ఆరోగ్యరంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని మోదీ చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందించడంలో భాగంగా పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యత అందిస్తున్నామని వివరించారు. నవసరి పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన ఏఎం నాయక్‌ హెల్త్‌ కాంప్లెక్స్‌, నిరళి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్‌లో పేదలకు మంచి చేసేందుకు ప్రారంభించిన ఆరోగ్య పథకాలను మోదీ గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో దేశంలోనూ మంచి ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకున్నారు. రెండు లక్షల రూపాయల ఆదాయం లోపు గల పేదలకు వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి అమృతం పథకాన్ని తాను ప్రారంభించానని చెప్పారు. ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం తీసుకొచ్చానన్నారు. ఈ పథకం కింద ఐదు లక్షల ఆదాయం లోపు గల పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఇప్పటి వరకు 40 లక్షలమంది గుజరాతీయులు, అందులో అత్యధికంగా మహిళలు లబ్ధి పొందారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img