. బాధితులకు తప్పని ఇక్కట్లు
. బుడమేరు ముంపునకు తప్పిదాలెన్నో !
. ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం
. సహాయ చర్యలు ముమ్మరం
. విద్యుత్, తాగునీరు పునరుద్ధరణ చర్యలు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: బుడమేరు ముంపు కొనసాగుతోంది. ఇంకా జలదిగ్బంధం నుంచి కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఓవైపు ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమవ్వగా… మళ్లీ వర్షాలు రావడంతో బాధితులు కలవరం చెందుతున్నారు. తాగునీరు, కరెంట్ తదితర సౌకర్యాలు లేకపోవడంతో బయట దారి పడుతున్నారు. కొందరు ఎటూ వెళ్లలేక నీట మునిగిన ఇళ్లకే పరిమితమమయ్యారు. బుడమేరు పరివాహక ప్రాంత ముంపులో చిక్కుకున్న బాధితులకు శివారు వరకూ పూర్తిగా సాయం అందలేదనే ఆవేదనలు ఇంకా విన్పిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా భారీగా భోజన సౌకర్యాలు పంపిణీకి చర్యలు తీసుకున్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదు. పునరావాస శిబిరాలకు బాధితుల్లో కనీసం 20శాతమే తరలించినట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారంతా ఎక్కడ ఉన్నారన్న సమాచారం లేదు. పభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. వరద ప్రవాహం తగ్గినచోట విద్యుత్ పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధమైంది. పారిశుద్ధ్య కార్మిక పనుల నిర్వహణలోనూ నిమగ్నమైంది. మళ్లీ వర్షాలు రావడంతో బుడమేరు గండ్ల పనురుద్దరణకు ఆటంకాలు ఎదురయ్యాయి. గండ్లు పూడిక పనులను అధికార యంత్రాంగం చేపడుతోంది. బుడమేరకు వరద ప్రవాహం తగ్గడం, మళ్లీ పెరగడం ముంపు ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. విజయవాడ నగరంలోని 20 కాలనీలు ప్రమాదంలో పడ్డాయి. బుడమేరుకు పడిన గండ్లను, మంపు ప్రాంతాల్లో బల్ల కట్టుపై సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎనికేపాడు దగ్గర ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాలకు ఆయన వెళ్లి గండ్లు పూడ్చే పనులపై ఆరా తీశారు. బుడమేరు గండ్లను కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
శనివారం రాత్రి ఏం జరిగింది ?
ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆగస్టు 31వ తేదీ శనివారం రాత్రి హడావుడిగా వెలగలేరు రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేయడంతోనే బుడమేరుకు వేలాది క్యూసెక్కుల వరదనీరు పోటెత్తింది. మరోవైపు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగి… ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా కృష్ణా నదిలోకి వరదను వదిలినప్పటికీ… అది నదిలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నీరు వెనక్కి తన్నుకొచ్చింది. దీంతో విజయవాడ ముంపునకు గురైంది. 1వ తేదీ ఆదివారం ఉదయం నుంచి బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. కేవలం అధికారుల నిర్లక్ష్యం విజయవాడ నగర ప్రజలు కన్నీరు పెట్టేలా చేసింది. విజయవాడలోని మూడో వంతుమంది ప్రజలు బుడమేరు ముంపునకు గురయ్యారు. విజయవాడకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారానే బుడమేరు వరదను నియంత్రిస్తారు. మైలవరం, ఏ కొండూరు, జీ కొండూరు కొండల్లో పుట్టిన బుడమేరు… వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర రెండు పాయలుగా చీలుతుంది. ఇందులోని ఒక ప్రవాహం ఇబ్రహీంపట్నం, ఆగిరిపల్లి మీదుగా కృష్ణానదిలోకి వెళ్తుంది. మరో పాయ విజయవాడ నగరం మీదుగా కొనసాగి… కొల్లేరు సరస్సులో కలుస్తుంది. విజయవాడలోకి రాకుండా ఈ వరదను ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానదికి మళ్లించడం అనవాయితీ. ఒకవేళ కృష్ణా నదిలో వరదపోటు ఎక్కువగా ఉంటే…వరదను విజయవాడలోకి వదులుతారు. ఇప్పుడు అదే పరిస్థితి జరగడంతో బుడమేరు ప్రాంతవాసులు నిరాశ్రయిలయ్యారు. ఈ తప్పిదాలతో విజయవాడ నగరంలో బుడమేరు జల విలయం సృష్టించింది. వాతావరణశాఖ హెచ్చరించినప్పటికీ…బుడమేరు గేట్లను మూడు రోజులు ముందుగా ఎందుకు ఎత్తలేదన్న విమర్శలున్నాయి. ఉన్న పళంగా వరద నీరు రావడంతోనే జక్కంపూడి, సింగ్‌నగర్, వాంబేకాలనీ తదితర ప్రాంతాలు నీట మనిగాయి. బుడమేరకు గండ్లు పడ్డాయి. విజయవాడ నగరంతోపాటు సమీప గ్రామాలను బుడమేరు వరద నీరు ముంచెత్తింది. విజయవాడలో దాదాపు 4 లక్షల మందికి నెలవు లేకుండా చేసింది. బుడమేరుకు వచ్చిన భారీ వరదను విజయవాడలోకి వదిలేసిన అధికారులు…ప్రజలను సరైన సమయంలో అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం వహించారు. ఆదివారం తెల్లవారు రaామున ప్రజలు నిదుర లేచే సమయానికి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తింది. కాలనీల్లో వరదనీరు వచ్చి అస్తవ్యస్తంగా మారిపోయింది. అంతటితో ఆగకుండా బుడమేరు పరివాహక ప్రాంతంలోని విజయవాడకు వెళ్లే దారి పొడవునా విధ్వంసం సృష్టించింది. అనేక చెరువులకు, కాలువలకు కొన్ని వందల చోట్ల గండ్లు పడేలా చేసింది. బుడమేరుకు భారీ స్థాయిలో వరద వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడిప్పుడే బుడమేరు ముంపు నుంచి బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నారు.