Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

గుండ్రేవులను మరిచారా?

. పూర్తయితే కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ
. కర్నూలు, కడప జిల్లాలు సస్యశ్యామలం
. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సమన్వయం అవసరం

పాలకుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని ప్రాజెక్టు

విశాలాంధ్రబ్యూరోకర్నూలు: రాయలసీమకు ముఖ్యంగా కర్నూలు కడప జిల్లాలకు గుండ్రేవుల ప్రాజెక్టు జీవనాడి. గుండ్రేవుల ప్రాజెక్టు ద్వారా కర్నూలు నగర ప్రజలకు తాగు, సాగునీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత బీడు భూములు సస్యశ్యామలమవుతాయి. అంతేకాకుండా. కర్నూలు-కడప కాలువ కింద ఉన్న పూర్తిస్థాయి ఆయకట్టుకు సరిపడా నీరు అందించవచ్చు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టు ప్రారంభంలోనే నిలిచిపోయింది. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా నిధులు లేక ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. పాలకులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియడం లేదు. తీవ్ర వర్షాభావంతో కర్నూలు జిల్లాలో కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామాలకు గ్రామాలు వలస పోతున్నాయి. అత్యధిక గ్రామాలు ప్రజలు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లలు, ముసలా ముతకా మాత్రమే గ్రామాల్లో జీవిస్తున్నారు. వర్షాలు పడితేనే పంటలు పండే పరిస్థితి. కర్నూలు, కడప జిల్లాల రైతులకు సాగు, తాగునీరు అందించే కేసీ కెనాల్‌కు సైతం పూర్తిస్థాయిలో నీరందక రబీలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలువకు నీరు అందించే సుంకేసుల డ్యాం నీటి సామర్థ్యం కేవలం 1.2 టీఎంసీలు మాత్రమే. దీంతో ఈ కాలువ కింద 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించలేకపోతున్నారు. కేసీ కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరు అందించాలన్నా, కరువు కాటకాలతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించాలన్నా తుంగభద్ర నదిపై గుండ్రేవుల వద్ద ప్రాజెక్టు నిర్మించడమే ఏకైక పరిష్కారం. సీ.బెలగల్‌ మండలం గుండ్రేవుల దగ్గర 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం డీపీఆర్‌ తయారీకి రూ.54.95 లక్షలకు పరిపాలన ఆమోదం ఇచ్చింది. ఐ అండ్‌ క్యాడ్‌ విభాగం సర్వే, విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో ముడిపడి ఉంది. రెండు రాష్ట్రాల సమన్వయంతోనే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కర్నూలు జిల్లాలోని సీ బెళగల్‌ మండలం సంగాల, కొత్త సంగాల, తిమ్మనదొడ్డి, పలుకుదొడ్డి, చింతమనపల్లి, రాయచోటి, గురుజాల, నాగలదిన్నె గ్రామాలు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెద్ద దన్వాడ, వేణి, సోమాపురం, కేశవరం గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. కర్నూలు జిల్లాలో చెరువుపల్లి, చామల గూడూరు, పెద్ద కొట్టాల, జోహరాపురం, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కటుకునూరు, కిసాన్‌ నగర్‌ గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యో అవకాశం ఉంది. 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి 2015 అక్టోబరు13న డీపీఆర్‌ను చీఫ్‌ ఇంజినీర్‌ హైదరాబాద్‌లోని అంతర్రాష్టాల జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌కు ఇరిగేషన్‌ కర్నూల్‌ ఎల్‌ఆర్‌ నెం. సీఈ(పీ) సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కేఆర్‌ఎంబీ ద్వారా రూ.2,890 (ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం రూ.5,400 కోట్లకు చేరింది)కోట్లకు ఈ ప్రాజెక్టు అనుమతి పొందింది. సుంకేసుల బ్యారేజ్‌కి తుంగభద్ర నదిపై అదనపు రిజర్వాయర్‌ కోసం ప్రభుత్వం సూత్రప్రాయంగా పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ 2019 ఫిబ్రవరి 21న జీవో ఆర్టీ నం.154 జారీ చేసింది. అంతేకాక అప్పటి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కోడుమూరు సమీపంలో శిలాఫలకం వేశారు. కేంద్రం 2020 అక్టోబరు ఆరున నీటి సమస్యలపై అపెక్స్‌ సమావేశం ఏర్పాటు చేసింది. కానీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కనీసం చర్చించలేదు.
ప్రభుత్వం కాలయాపన
డీపీఆర్‌ను ఆమోదించినా ఇంతవరకు ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నా ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం ఎండమావిగా మారడంతో కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతులు, కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో రాయలసీమకుపై ప్రేమ కురిపించే నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత నిర్లక్ష్యం చేయడం పరిపాటిగా మారింది. కరువు కాటకాలతో ప్రజలు వలస పోతూ గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.అప్పులపాలై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ పాలకుల మనస్సు మాత్రం కరగడం లేదు. అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. గుండ్రేవులను త్వరగా పూర్తిచేస్తే తెలంగాణ, ఏపీ ప్రజలకు చాలా వరకు న్యాయం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img