. అనుచరుడు కూడా ఎన్‌కౌంటర్
. యూపీ పోలీసుల దుందుడుకు
లక్నో/రaాన్సీ: ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసు నిందితుడు, రాజకీయ నేతగా మారిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను పోలీసులు గురువారం కాల్చి చంపారు. అసద్‌తో పాటు మరో నిందితుడు గుల్హామ్‌ను కూడా ఎన్‌కౌంటర్ చేశారు. రaాన్సీలో రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఎన్‌కౌంటర్‌లో వారిద్దరు హతమయ్యారు. ఘటనాస్థలంలో అధునాతన విదేశీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్‌పాల్ హత్య కేసులో విచారణ నిమిత్తం అతీక్ అహ్మద్‌ను గురువారం ప్రయాగ్‌రాజ్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. అదే సమయంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం విశేషం. 2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజుపాల్ హత్యకేసులో ప్రధానసాక్షి ఉమేశ్ పాల్ ఫిబ్రవరి 24న దారుణహత్యకు గురయ్యాడు. ఆయనతో పాటు ఇద్దరు అంగరక్షకులను హంతకులు పట్టపగలే కాల్చి చంపారు. ఉమేశ్ పాల్ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఉమేశ్ భార్య జయ పాల్ ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిపై కేసు నమోదు చేశారు. ఉమేశ్‌పాల్ హత్యకేసులో అతీక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ హత్య తర్వాత నుంచి అసద్, అతీక్ అనుచరుడు గుల్హామ్ అదృశ్యమయ్యారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు…వీరిపై రూ.5లక్షల చొప్పున రివార్డు కూడా ప్రకటించారు. వీరిద్దరూ రaాన్సీలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లారు. అక్కడ పోలీసులు, నిందితుల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకొంది. ఉమేశ్‌పాల్ హత్య కేసులో ఓ షార్ప్ షూటర్, మరో నిందితుడిని కొన్నాళ్ల క్రితమే యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలో రాజుపాల్ అలహాబాద్ (పశ్చిమ) స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అతీక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజిమ్‌పై విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే రాజుపాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ ప్రస్తుతం గుజరాత్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రాజుపాల్ హత్య కేసులో ఉమేశ్‌పాల్ ప్రధాన సాక్షిగా ఉన్నారు. గతంలో ఉమేశ్‌పాల్‌ను అతీక్ అహ్మద్ అనుచరులు ఓసారి కిడ్నాప్ చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగానే ఉమేశ్‌ను దారుణంగా హత్య చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో అతీక్ అహ్మద్‌కు ఇటీవల ప్రయాగ్‌రాజ్ కోర్టు జీవిత ఖైదు విధించింది.