Friday, March 31, 2023
Friday, March 31, 2023

చర్చించాల్సిందే

. ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు
. మూడోరోజూ పార్లమెంటు వాయిదా
. గాంధీ విగ్రహం వద్ద విపక్ష నేతల ధర్నా
. జేపీసీ లేదా సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తునకు డిమాండ్‌

న్యూదిల్లీ : హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదిక, అదానీ కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలు పార్లమెంటును కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబబుతు న్నాయి. దీంతో వరుసగా మూడో రోజు పార్లమెంట్‌ స్తంభిం చింది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే మంగళవారానికి వాయిదా పడిరది. మరోవైపు, అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశాయి. ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో స్పీకర్‌, చైర్మన్‌ ఉభయ సభలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాలు ఇవ్వగా.. ఉభయ సభల సభాధ్యక్షులు తిరస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిపేందుకు విపక్షాలు సహకరించాలని సభాపతులు సూచించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనలతో ఎటువంటి చర్చ లేకుండానే లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఉభయ సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. దీంతో వరుసగా మూడో రోజూ పార్లమెంట్‌లో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత.. 2వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మా నంపై చర్చ జరపాల్సి ఉంది. అయితే, అదానీ షేర్ల పతనం అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్‌ చేయడంతో మూడు రోజులుగా ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవక లకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందని గతవారం అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండిరచింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అదానీ గ్రూప్‌ షేర్ల పతనం ఓ పెద్ద కుంభకోణమని, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ప్రభుత్వరంగ సంస్థలుగా సామాన్యులు డబ్బు అందులో ఇమిడి ఉందని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని, కోట్లాదిమంది కష్టపడి సంపాదించిన డబ్బు అదానీ కంపెనీల్లోకి వెళ్లిందని, ఈ అక్రమాలన్నీ బయటికి రావడానికిగాను జేపీసీ లేదా సీజేఐ నేతృత్వంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాల్సిందేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే డిమాండ్‌ చేశారు. అదానీ గ్రూపుల కుంభకోణంతో ప్రధాని మోదీకి సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయన కనీసం దీని గురించి స్పందించడం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. అదానీ అంశంపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి సోమవారం ఉదయం ఖడ్గే చాంబర్‌లో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌, డీఎంకు, ఎన్‌సీపీ, బీఆర్‌ఎస్‌, జేడీయూ, ఎస్‌పీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌ఎస్‌పీ, ఆప్‌, ఐయూఎంఎల్‌, ఆర్‌జేడీ, శివసేన నేతలు సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటు వాయిదా తర్వాత విపక్ష నేతలంతా గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. ప్రతిపక్ష నేతల సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ హాజరు కాలేదు. అయితే గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో తృణమూల్‌ ఎంపీలు పాల్గొన్నారు. అదానీ కుంభకోణంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని రాసిన బ్యానర్‌ను ఎంపీలు ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img