Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

చలో విజయవాడ ఉద్రిక్తం

అడుగడుగునా పోలీసుల ఆటంకం

. పూలే విగ్రహం నుంచి నిరసన ప్రదర్శన
. సీపీఐ, దళిత, మైనార్టీ నేతల అరెస్టు
. మానవత్వం మరచిన సీఎం జగన్‌
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: దళితులు, మైనార్టీలపై దాడులను నిరసిస్తూ సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి అధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీపీఐ, దళిత, మైనార్టీ, ప్రజాసంఘాల నేతలు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం పూలే విగ్రహం నుంచి శాంతియుతంగా ప్రదర్శనతో బయల్దేరగా… ఒక్కసారిగా పోలీసులు రంగంలోకి దిగి ప్రదర్శనను అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జల్లి విల్సన్‌, దళిత హక్కుల పోరాటసమితి (డీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.రామకృష్ణ, ఏపీ మైనార్టీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ ఫారూక్‌ షుబ్లీ, డీహెచ్‌పీఎస్‌ నాయకుడు కళింగ లక్ష్మణరావు తదితరులను పోలీసులు బలవంతంగా వ్యాన్లలో ఎక్కించారు. వారిని గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు తాడేపల్లిలోని తన ఇంటి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి బయల్దేరిన రామకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. చలో విజయవాడకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని రామకృష్ణ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు చేరుకున్నారు. రామకృష్ణ సహా సీపీఐ, దళిత, మైనార్టీ, ప్రజాసంఘాల నేతలు అక్కడ కొంతసేపు నిరసనకు దిగారు. జోహార్‌ జ్యోతిరావు పూలే, జోహర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులను ఖండిరచాలని నినదించారు.కాగా, చలో విజయవాడకు తరలివస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు రాత్రి నుంచే ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేశారు. కొన్నిచోట్ల అరెస్టులకు పాల్పడ్డారు. రామకృష్ణ మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి దళిత, మైనార్టీలపై హత్యాకాండ కొనసాగుతోందని విమర్శించారు. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో జిల్లాస్థాయి అధికారి డాక్టర్‌ అచ్చెన్నను హత్యచేస్తే…సీఎం బాధిత కుటుంబ సభ్యులను ఫోన్లో సైతం పరామర్శించలేదని మండిపడ్డారు. ఆశ్చర్యమేమంటే డా.అచ్చెన్నకు శవ పంచనామా చేయలేదని, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. హంతకులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మానవతా విలువలు మరచిపోయారన్నారు. అచ్చెన్న హత్యపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకుగాను సిట్టింగ్‌ జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ను మానసికంగా వేధింపులకు గురిచేసి, హింసించి ఆయన చనిపోవడానికి వైసీపీ ప్రభుత్వం కారణమైందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి మృతదేహాన్ని డోర్‌ డెలీవరీ చేశాడని, అయినా ఆ ఎమ్మెల్సీకి అధికార పక్షం పూలదండలు వేసిందేగానీ…చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. కర్నూలు జిల్లా ఎర్రవాడలో మైనార్టీ యువతిపై అత్యాచారం, హత్య జరిగిందని, నిందితులు కళ్లెదుట తిరుగుతున్నా చర్యలు శూన్యమన్నారు. నంద్యాలలో అబ్దుల్‌ సలామ్‌ కుటుంబ సభ్యులు నలుగురి ఆత్మహత్యకు పోలీసులే కారణమని మండిపడ్డారు. వాటన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దళిత, మైనార్టీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. చలో విజయవాడకు రాకుండా కర్నూలు, కడప, ఉభయగోదావరి, గుంటూరు తదితర జిల్లాల్లో అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఫారూక్‌ షుబ్లీ మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రమాణం చేసినప్పటి నుంచి దళిత, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత, మైనార్టీలపై కొనసాగుతున్న దాడులు, హత్యలపై సీఎం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. దాడులను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. అమరావతి బహుజన జేఏసీ నాయకుడు పి.బాలకోటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కులను కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ లేదని మండిపడ్డారు. పూలే, అంబేద్కర్‌ ఆశయాలతో అధికారం చేపట్టిన సీఎం, మంత్రులు బాధ్యతగా వ్యవహరించకపోవడం విచారకరమన్నారు. నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య, ఇన్సాఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌ అఫ్సర్‌, అఖిలపక్ష, దళిత, మైనారిటీ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img