Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

చల్లటి కబురు

రెండు రోజుల్లో కేరళకు రుతుపవనాలు

న్యూదిల్లీ: వాతావరణ శాఖ దేశ (ఐఎండీ) ప్రజలకు చల్లటి కబురు మోసుకొచ్చింది. అనుకూల పరిస్థితుల నేపథ్యంలో మరో 48 గంట్లలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ప్రకటించింది. రుతుపవనాల రాక ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలో ‘బిపోర్‌జాయ్‌’ తుపాను కారణంగా అది మరింత ఆలస్యం కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనా తప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ రుతుపవనాల రాక కోసం రైతులు ఎదురు చూస్తుండగా.. బుధవారం భారత వాతావరణ శాఖ ఊరట ఇచ్చే వార్త అందించింది. చల్లని గాలులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్‌, కేరళ తీరాల ప్రాంతాలలో మేఘాల విస్తరణ కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ‘దక్షిణ అరేబియా సముద్రం మీదుగా గాలులు వీస్తున్నాయి. అవి క్రమంగా బలపడుతున్నాయి. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవన్నీ రుతుపవనాల రాకకు అనుకూలిస్తాయి. మరో ఒకటి రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది’ అని పేర్కొంది. వాస్తవానికి గతేడాది జూన్‌ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమయ్యింది. తొలుత జూన్‌ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినా అది జరగలేదు. బిపోర్‌జాయ్‌ తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్లు భావించారు. కానీ తాజాగా రుతుపవనాల ఆచూకీ కన్పించడంతో వాతావరణశాఖ తాజాగా ప్రకటన చేసింది. నైరుతి సీజన్‌ కు సంబంధించి ఐఎండీ ఇటీవల వెల్లడిరచిన నివేదికలన్నీ తారుమారయ్యాయి. రుతుపవనాలు ఆలస్యమైన నేపథ్యంలో, 96 శాతం వర్షపాతం అంచనా అయినా నిజమవుతుందో, లేదో చూడాలి. ఎందుకంటే, గతంలో రుతుపవనాలు ఆలస్యం అయిన ప్రతిసారి వర్షపాతం తక్కువగా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం దక్షిణ చత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీనపడిరదని పేర్కొంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా గురు, శుక్రవారాల్లో అదిలాబాద్‌, కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. కాగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తామని తెలిపింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ వేగంతో వేడి గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img