విశాలాంధ్ర-మచిలీపట్నం టౌన్ : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ, సొసైటీల్లో నిల్వ ఉన్న వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అధ్వర్యంలో సోమవారం కృష్ణాజిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత కార్మికుల నినాదాలతో ధర్నాచౌక్ మారుమోగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సహకార సంఘాలలో నిల్వ ఉన్న వస్త్రాలను అమ్మడానికి రిబేట్ సౌకర్యం కల్పిం చాలనీ, రోజురోజుకు పెరిగిపోతున్న నూలు ధర లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కట్ట్టా హేమసుందర్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోదుమూడి రామారావు, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోదాటి నారాయణరావు, కార్యదర్శి బాలసుబ్రమణ్యం, కోదాటి నాగయ్య, కుర్మా వెంకటేశ్వరరావు, పృధ్వీ సుబ్రహ్మణ్యం, కె. ఉమామహేశ్వరరావు, పిచ్చుక. సుబ్రహ్మణ్యం ఏఐటీయూసీి జిల్లా కార్యదర్శి లింగం ఫిలిప్ తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.