. హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ
. అమరావతి కేసు విచారణ మరింత జాప్యం
. జులై 11కి విచారణ వాయిదా
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును త్వరగా ముగించుకుని పరిపాలనా రాజధానిని విశాఖపట్నం మార్చుకోవాలని తొందరపడుతున్న జగన్ సర్కార్‌కి అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలతో ఎప్పటికప్పుడు బ్రేక్‌లు పడుతున్నాయి. ఉగాది నాటికి విశాఖ తరలివెళ్లాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని కేసును త్వరగా విచారణ చేపట్టాలని సుప్రీంను కోరింది. అయినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తుండగా, మంగళవారం నాటి విచారణతో తేలిపోతుందని ప్రభుత్వపెద్దలు ఆశించినప్పటికీ మళ్లీ వాయిదా పడిరది. ఈసారి ఏకంగా జులై 11కి విచారణ వాయిదా పడిరది. దీంతో రాష్ట్ర రాజధానిపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించట్లేదు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు పోరాటం చేస్తుండగా…హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై న్యాయమూర్తి కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం సుదీర్ఘంగా విచారించింది. పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం కోరగా…న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పదేపదే కోరినప్పటికీ అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అమరావతి రైతుల పిటిషన్‌తో పాటు ప్రభుత్వ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ…ప్రభుత్వం తరపు పిటిషన్‌ను జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న తరువాత హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్థం లేదంటూ తొలుత రైతుల తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ఞప్తులను జస్టిస్ కేఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16న జస్టిస్ కేఎం జోసెఫ్ పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కేసు విచారణను జులై 11కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. జులై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తను రిటైర్ అవుతున్నందున అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పు రాసేందుకు సమయం లేదని జస్టిస్ జోసెఫ్ తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరణించిన వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు న్యాయవాదులు అనుమతి కోరారు. దానికి అనుమతిస్తూ వారికి వెంటనే నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది.
సుప్రీం అసహనం
సుప్రీంకోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారడంతో అమరావతి కేసుపై విచారణ ఆలస్యమైంది. మొదటి 5 కేసుల విచారణ తర్వాత 12వ నెంబర్ నుంచి 20వ నెంబర్ కేసు వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 7వ నెంబర్ కేసు నుంచి 11వ నెంబర్ కేసు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 21 నుంచి 39, 41వ నెంబర్ కేసులను కోర్టు విచారిస్తుంది. ప్రస్తుతం 10వ నెంబర్ కేసుగా అమరావతి రాజధాని కేసు ఉంది. అయితే ప్రస్తుతం 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో అమరావతి కేసును ప్రస్తావించేందుకు ప్రభుత్వ న్యాయవాదులు యత్నించడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక కేసు సగం విచారణలో ఉండగా మరో కేసు ఎలా విచారించాలని జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా.. మరో కేసు విచారించడం కుదరదని స్పష్టం చేశారు.