Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

జమిలి ఎన్నికలు అసాధ్యం

అనేక సమస్యలున్నాయి
పార్లమెంట్‌లో ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూదిల్లీ : గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమైన జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టత ఇచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమని పార్లమెంట్‌లో తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంట్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ వెల్లడిరచారు. జమిలి ఎన్నికలపై అనేక మంది ఎంపీలు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి (జమిలి) ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ, ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పని కాదని మేఘ్వాల్‌ తెలిపారు. ‘‘లాభాలున్నప్పటికీ అనేక అవరోధాలు కూడా ఉన్నాయి. జమిలి ఎన్నికలు జరపాలంటే కీలకమైన ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు అందుకు సమ్మతించాలి. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీప్యాట్‌ల అవసరం ఉంటుంది. ఒకేసారి అన్ని చోట్లా భద్రతా బలగాల మోహరింపు సాధ్యం కాకపోవచ్చు. జమిలి ఎన్నికలపై న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన చేసింది. సీఈసీ సహా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపింది. తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్‌ పరిశీలనలో ఉంది.’’ అని మేఘ్వాల్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్నికలలో పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్‌ మిషన్స్‌ అవసరమని, అందుకు రూ.వేలకోట్లు ఖర్చవుతాయన్నారు. ఈవీఎంలు, వీవీపాట్స్‌ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పని చేయవని, ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అదే సమయంలో ఒకేసారి జరిగే ఎన్నికలకు భారీగా పోలింగ్‌ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరమవుతాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img