Monday, August 15, 2022
Monday, August 15, 2022

‘జీపీఎఫ్‌’ రగడ

రూ.800 కోట్లు ఏమైనట్లు?
ఆర్థికశాఖ దాటవేత
ఉద్యోగ సంఘాల ఆగ్రహం
హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యనిధి(జీపీఎఫ్‌) ఖాతాల నుంచి సొమ్ము మాయమైన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. ఈనెల 28వ తేదీ సాయంత్రం ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో డబ్బులు వేసినట్లే వేసి, మళ్లీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. 90వేల ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో నుంచి రూ.800కోట్లు గల్లంతైనట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రభుత్వం ఆ సొమ్ము తీసుకోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు మండిపడుతు న్నారు. పిల్లల వివాహాలు, చదువులు ఇతరత్రా వ్యక్తిగత అవసరాల కోసం జీపీఎఫ్‌ నుంచి అడ్వాన్స్‌ ఇప్పించాలని ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి నిలిచిపోయాయి. అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం(ఏజీ) గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల జీపీఎఫ్‌ వార్షిక వివరాలను అంతర్జాలంలో పొందుపరిచింది. ఆ లావాదేవీలను పరిశీలించిన ఉద్యోగులకు నిధుల మాయం విషయం తెలిసింది. తమకు తెలియకుండానే తమ ఖాతాలకు చెందిన సొమ్ము డెబిట్‌ అయినట్లు గుర్తించారు. డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో జులై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి వారికి తెలియకుండానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. గతేడాది తరహాగానే డబ్బులు క్రెడిట్‌, డెబిట్‌ అయినట్లు చూపడం సరికాదని ఉద్యోగులు వాపోతున్నారు. ఎలా జరిగిందో తమకు తెలియదని, సాంకేతిక లోపం కావచ్చని, దానిపై విచారించి స్పష్టత ఇస్తామంటూ ఆర్థిక శాఖాధికారులు బదులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వ వ్యవహారంపై ఉద్యోగ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఆర్థిక శాఖాధికారుల నుంచి స్పందన లేదు: బొప్పరాజు, బండి
ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి సొమ్ము మాయంపై తాము ఆర్థిక శాఖాధికారులను కలిసి వివరణ కోరినప్పటికీ, వారి నుంచి సరైన స్పందన లేదని ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు చెప్పారు. జీపీఎఫ్‌ ఖాతాల నుంచి ఉద్యోగుల అనుమతి లేకుండా ఎలా తీసుకుంటారంటూ అధికారులను తాము ప్రశ్నిస్తే, వారి నుంచి సమాధానం లేదనీ, ఆర్థిక శాఖాధికారులు సైతం ఈ గల్లంతుపై దాటవేత ధోరణితో ఉన్నారని చెప్పారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదని ఆర్థిక శాఖాధికారులు తమకు తెలిపినట్లు బండి శ్రీనివాసరావు చెప్పారు.
ఉద్యోగుల సొమ్ముకు రక్షణేదీ: అశోక్‌బాబు
ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ముకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌ బాబు అన్నారు. రూ.800కోట్ల ఉద్యోగుల సొమ్ము ఎవరు వాడుకున్నారనే విషయంలో స్పష్టత లేదన్నారు. రూ.800కోట్లు మాయమైతే ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా గల్లంతు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
ఇది మోసపూరితం: మనోహర్‌
జీపీఎఫ్‌ ఖాతాల్లో నుంచి రూ.800 కోట్ల సొమ్మును ప్రభుత్వం మళ్లించి, మోసపూరితంగా వ్యవహరించిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జీపీఎఫ్‌ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకొనే అధికారం కేవలం ఉద్యోగికే ఉంటుందని, ప్రభుత్వం ఆ నిధికి కేవలం రక్షకురాలు మాత్రమేనన్నారు. ఉద్యోగుల సొమ్మును వారికి తెలియకుండానే తీసేసుకుంటోందంటే ఈ పాలకుల ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని, ఉద్యోగులకు కరువు భత్యం పీఎఫ్‌ ఖాతాలో వేసినట్లే వేసి వెనక్కి తీసుకోవడం ద్వారా మోసగించడమేనన్నారు. రూ.800 కోట్లు ఎటు మళ్లించారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
సీఎస్‌ రాజీనామా చేయాలి: నరహరిశెట్టి
ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము గల్లంతుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఏఐసీసీ సభ్యులు, విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు ప్రభుత్వం భద్రత కల్పించలేదని, ఆర్థిక శాఖాధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img