Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

జీవో నంబరు 1 రద్దు చేయకుంటే మార్చిలో ‘చలో అసెంబ్లీ’

. పౌరహక్కుల వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక
. 19న అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో విజయవాడలో రాష్ట్ర సదస్సు

విశాలాంధ్ర`విజయవాడ : ప్రజాస్వామ్య హక్కులను, నిరసనలను కాలరాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు 1ని రద్దు చేయకుంటే మార్చిలో ‘చలో అసెంబ్లీ’ నిర్వహించాల్సి ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవో నంబరు 1 రద్దు పోరాట ఐక్య వేదిక అధ్వర్యంలో విజయవాడ ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి వేదిక కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు గన్నవరంలో ధర్నా పెట్టుకుంటే అనుమతి ఇవ్వలేదని, లోకేశ్‌ పాదయాత్ర చేస్తుంటే ఆయనపై కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో పోలీసులు కూడా ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలు బస్సు యాత్ర చేస్తున్నా, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వటం లేదని ప్రశ్నించారు. కోర్టులు లేకపోతే ఈ సీఎం ఇంకా ఏమి చేసేవాడో అని ధ్వజమెత్తారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు హైకోర్టులో చివాట్లు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొడిగట్టిందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌లు ట్యాప్‌ చేస్తుంటే ఇక ప్రతిపక్షాల నాయకులు ఫోన్లు ట్యాప్‌ చేయటం సాధారణ విషయమే అన్నారు. పోలీసులు ద్వారా, కోర్టుల ద్వారా, బెదిరింపుల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు గవర్నర్‌ను కలిసినందుకు సస్పెండ్‌ చేస్తామని ఉద్యోగులను బెదిరిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ మాట్లాడుతూ జీవో నంబరు 1కి వ్యతిరేకంగా ప్రజావేదికను నిర్మాణం చేయాలన్నారు. చంద్రబాబు సభ సందర్భంగా కందుకూరు, గుంటూరులో జరిగిన మరణాలను గమనిస్తే ఏదో పథకం ప్రకారం జరిగినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, రాయలసీమలో జీవో నంబరు 1 రద్దు అంశంపై ప్రాతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాసమస్యలపై ఉద్యమించే ప్రతి కార్యక్రమానికి కోర్టు నుంచే అనుమతి తెచ్చుకోవాల్సి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం లేదన్నారు. దీంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అనే అనుమానం కలుగుతుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం పాదయాత్ర చేయటానికి కూడా కోర్టు నుంచి అనుమతి పొందారని గుర్తు చేశారు. సీపీఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగలేవన్నారు. హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు గత కార్యక్రమాలను సమీక్షించారు. ప్రజల వ్యతిరేకతను ఏమాత్రం గౌరవించకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిరచవలసిన అవసరం ఉన్నదని వక్తలు అభిప్రాయపడ్డారు. జీవో నంబరు`1 రద్దు పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ దిశగా ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు జరపాలని సమావేశం పిలుపునిచ్చింది. ఆ సదస్సుకు రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, పౌరహక్కుల, న్యాయవాద సంఘాల, ప్రజాసంఘాల నాయకులను, మేధావులను ఆహ్వానించి భవిష్యత్‌ కార్యక్రమాలను రూపకల్పన చేయాలని సమావేశం నిర్ణయించింది. అదే సందర్భంలో ఉద్యమాన్ని జిల్లా స్థాయి వరకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో జీవో నంబరు 1 రద్దు పోరాట వేదిక కన్వీనర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌, ఆర్‌పీఐ నాయకులు పెట్ట వరప్రసాద్‌, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు డి.హరినాథ్‌, అమరావతి జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య, మహిళా నాయకులు డి.రమాదేవి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.మాల్యాద్రి, శ్రామిక మహిళ నాయకులు డి.రమాదేవి, నవక్రాంతి పార్టీ నాయకులు, ప్రజానాట్యమండలి నాయకులు పిచ్చయ్య, ఏఐవైఎఫ్‌ నాయకులు సుబ్బారావు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఎం.సాయికుమార్‌ తదితరులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, ప్రజాఉద్యమాలపై నిర్బంధ కాండను తీవ్రంగా ఖండిరచారు. ఐక్య వేదిక కార్యక్రమాలకు మద్దతు పలికారు. జీవో నంబరు 1 రద్దు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిని కొనసాగిస్తే మార్చిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని సమావేశం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img