Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

జీ20కి వేళాయె…

. నేడు, రేపు శిఖరాగ్ర సమావేశాలు
. దిల్లీ చేరుకున్న విదేశీ అతిథులు
. సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం
. ద్వైపాక్షిక చర్చల్లో మోదీ బిజీబిజీ

న్యూదిల్లీ: భారత్‌ అధ్యక్షతన తొలిసారి జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేళైంది. సదస్సు శనివారం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న దిల్లీలో గల ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపం శని, ఆదివారాల సమావేశాలకు వేదికైంది. జీ20కి వచ్చిన దేశాధినేతలు, అతిథుల కోసం కళ్లు చెదిరిపోయేలా దిల్లీ నగరం ముస్తాబైంది. విద్యుత్‌ దీపాలు, బ్యానర్లు, జీ20 జెండాలతో కళకళలాడుతోంది. జీ20 సదస్సు విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి వేదికగా మారింది. నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత మండపంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు జరిగాయి. విదేశీ ప్రతినిధులు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. దీంతో రాజధాని నగరంలో సందడి వాతావరణం నెలకొంది. యూరోపియన్‌ యూనియన్‌ అధికారులు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు సదస్సులో పాల్గొంటారు. అమెరికా, బ్రిటన్‌, బంగ్లాదేశ్‌, మారిషస్‌, జపాన్‌, అర్జెంటైనా, ఇటలీ అధినేతలతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటర్రస్‌, ఐఎంఎఫ్‌ అధ్యక్షులు క్రిస్టాలినా జార్జియావా తదితరులు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. వారికి విమానాశ్రయంలో సంప్రదాయ నృత్యప్రదర్శనతో ఆత్మీయ స్వాగతం లభించింది. కళాకారులతో పాటు క్రిస్టాలినా కూడా నృత్యం చేశారు. బంగ్లాదేశ్‌, ఇటలీ ప్రధానులు షేక్‌ హసీనా, జార్జియా మెలానీలకు కేంద్రమంత్రులు శోభా కరణ్‌దాల్జే, దర్శనా జోదేశ్‌ స్వాగతం పలికారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన రిషి సునాక్‌కు కేంద్రమంత్రి అశ్వినీ చౌబే, అర్జెంటైనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌కు కేంద్రమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కేంద్రమంత్రి వీకే సింగ్‌ సాదర స్వాగతం పలికారు. కమరూస్‌ అధ్యక్షుడు అజిల్‌ అస్సౌమనికీ ఘన స్వాగతం లభించింది. శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా అంతర్జాతీయ సవాళ్లు, సమస్యలను నాయకులు కూలంకషంగా చర్చించనున్నారు. మానవ ప్రయోజనాలు, సమ్మిళిత అభివృద్ధికి కొత్త మార్గాన్ని సదస్సు నిర్దేశిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత ఆతిథ్యాన్ని ప్రపంచ నేతలు ఆస్వాదిస్తారన్నారు. రెండు రోజులు జరగబోయే సమావేశాల క్రమంలో ప్రపంచ నేతలను కలిసేందుకు, వారితో చర్చలు జరిపేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని మోదీ వెల్లడిరచారు. ఇదిలావుంటే, జీ20 కారణంగా శనివారం రాష్ట్రపతి భవన్‌ వద్ద ‘ఛేంజ్‌ ఆఫ్‌ గార్డ్‌’ వేడుక జరగబోదని అధికార వర్గాలు వెల్లడిరచాయి. రాష్ట్రపతి బాడీగార్డ్స్‌ ప్రతివారం మారే సమయంలో ‘ఛేంజ్‌ ఆఫ్‌ గార్డ్‌’ నిర్వహిస్తారు.
బంగ్లాదేశ్‌, మారిషస్‌ ప్రధానులతో ద్వైపాక్షిక భేటీ: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్‌- బంగ్లాదేశ్‌ సంబంధాలు ఎంతగానో వృద్ధి చెందాయని, అనుసంధానం, వాణిజ్య బంధం తదితర అంశాలపై చర్చించినట్టు మోదీ ట్వీట్‌ చేశారు. మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌తో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగినట్లు పేర్కొన్నారు. రెండు దేశాల దౌత్య బంధానికి 75 ఏళ్లు అయినందున ఇది భారత్‌-మారిషస్‌ సంబంధాలకు ప్రత్యేక సంవత్సరమని మోదీ వెల్లడిరచారు. మౌలిక వసతులు, ఫిన్‌టెక్‌, సంస్కృతి తదితర రంగాల్లో సహకారంపై చర్చించినట్లు ఎక్స్‌ మాధ్యమంగా తెలిపారు.
బైడెన్‌తో కీలక చర్చలు: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ తన అధికారిక నివాసంలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, సాంకేతిక, వాణిజ్యరంగాలకు సంబంధించిన ఒప్పందాలతో పాటు జేఈజెట్‌ ఇంజిన్‌ ఒప్పందం, అమెరికా నుంచి ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్‌, అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పరస్పర సహకారం, అణురంగంలో పురోగతి తదితర అంశాలపై చర్చించారు. బైడెన్‌కి ఐటీసీ మౌర్య హోటల్‌లో బస ఏర్పాటు చేయగా భద్రతా చర్యల్లో భాగంగా హోటల్‌లోని అన్ని అంతస్తులను అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ హోటల్‌లో మొత్తం 400 గదులను అతిథుల కోసం బుక్‌ చేశారు. శనివారం మహాత్మాగాంధీకి నివాళి అర్పించిన తర్వాత బైడెన్‌ సదస్సుకు హాజరుకానున్నారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img