Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

జై… అమరావతి

మహా పాదయాత్ర 2.0 ప్రారంభం

. రైతులకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు బ జనసంద్రంగా రాజధాని ప్రాంతం
. వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరు
. తొలిరోజు వెంకటపాలెం నుంచి మంగళగిరికి చేరిన యాత్ర

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అమరావతిపై పాలకపక్ష నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని, న్యాయస్థాన ఆదేశాలను సైతం అమలు చేయకుండా అవలంభిస్తున్న కుట్రపూరిత చర్యలను తిప్పికొట్టేందుకు, ఏకైక రాజధాని ఆవశ్యకత రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.0 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. వెంకటపాలెంలో ప్రారంభమైన తొలిరోజు పాదయాత్ర కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు మీదుగా సాగి మంగళగిరిలో ముగిసింది. రాజధాని ఉద్యమానికి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి నుంచి అరసవిల్లికి 60 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్రను వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద రైతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. తదుపరి సర్వమత ప్రార్థనలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంతంలోని గ్రామాలతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరూవాడా, పిల్లాపెద్దా అంతా ఒక్కటై రైతులకు తోడుగా ముందుకు కదిలారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై… అమరావతి… జైజై… అమరావతి అనే నినాదాలు మారుమ్రోగాయి. ప్రాణాలైనా అర్పిస్తాం… అమరావతిని కాపాడుకుంటాం అని నినదించారు. హైకోర్టు 600 మంది పాదయాత్రలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వగా, వారిలో కూడా ఎక్కువ సంఖ్యలో మహిళలే ఉండటం విశేషం. ప్రత్యేకంగా అలంకరించిన వెంకటేశ్వరస్వామి రథం పాదయాత్రలో ఆకర్షణగా నిలిచింది. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్నారు. ఇక పాదయాత్ర ప్రారంభం దగ్గర నుంచి మంగళగిరిలో ముగిసే వరకు అన్ని గ్రామాల్లో అన్నదాతలకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర రథానికి నీళ్లు చల్లి, కొబ్బరికాయలు కొట్టి హారతులిస్తూ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఫీుభావం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు సైతం పాల్గొనడం విశేషం. దీంతో రథం నడిపే బాధ్యతను వైసీపీ శ్రేణులకే రైతులు అప్పగించారు. వెంకటపాలెం నుంచి మొదలై పాదయాత్రగా ముందుకు సాగుతున్న రైతులకు కృష్ణాయపాలెం ప్రజలు పూలబాట పరిచి ఘనంగా స్వాగతం పలికారు. రెండు ట్రాక్టర్లతో పూలు తీసుకొచ్చిన గ్రామస్తులు పాదయాత్ర మార్గంలో దారిపొడవునా వారిపై పూల వర్షం కురిపించారు. పాదయాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ఆకుపచ్చ బెలూన్లను గాలిలోకి వదిలారు. పెనుమాకలోనూ ప్రజలు అడుగడుగునా రైతులపై పూలు చల్లి స్వాగతం పలుకుతూ వారికి తాగునీరు, మజ్జిగ అందజేశారు. మద్దతుగా తరలివచ్చిన ప్రజలతో రైతుల పాదయాత్ర సాగిన మార్గం కనుచూపు మేరలో జన ప్రవాహంలా కనిపించింది.
జగన్‌ ఇకనైనా మొండిపట్టు వీడాలి : సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇకనైనా మొండిపట్టు విడనాడి, మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ అమరావతి రాజధాని నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలియజేసి, ఇప్పుడు వ్యతిరేకించడం తుగ్లక్‌ చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారవన్న విషయాన్ని గ్రహించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా, చివరకు న్యాయస్థానం సైతం విభజన చట్టం ప్రకారం ఆ అధికారం రాష్ట్రానికి లేదని స్పష్టంగా చెప్పినా జగన్‌ తన వైఖరి మార్చుకోకపోవడం మూర్ఖత్వమన్నారు. ఇకనైనా బేషజాలకు పోకుండా మూడు ముక్కలాటను ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జగన్‌ను హెచ్చరించారు. ఈ పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జంగాల అజయ్‌కుమార్‌, గుంటూరు నగర కార్యదర్శి కోటా మాల్యాద్రితో పాటు సీపీఐ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అంతిమ విజయం రైతులదే: టీడీపీ
అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, అంతిమ విజయం వారిదేనని టీడీపీ నేతలు తెలిపారు. రైతుల మహా పాదయాత్ర 2.0కు మద్దతుగా మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్‌, శ్రావణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తదితరులు పాదయాత్రలో రైతులకు సంఫీుభావంగా నడిచారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసం 1000 రోజులుగా చేస్తున్న పోరాటం రైతుల సంకల్పానికి నిదర్శనమన్నారు. లాఠీలు రaుళిపించినా, దాడులు చేసినా, భరిస్తూ రైతులు ముందుకు సాగుతున్నారని కొనియాడారు. వెయ్యి కిలోమీటర్ల రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మూర్ఖపు ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని, లేనిపక్షంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి చేతనైతే మూడు రాజధానుల నిర్ణయంపై అసెంబ్లీని రద్దు చేసి, ప్రజా తీర్పు కోరాలని డిమాండ్‌ చేశారు.
కేంద్రం నిధులివ్వాలి: శ్రీనివాసరావు
రైతుల పాదయాత్రను అడ్డుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించటం గర్హనీయమని, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే కుట్రలను తిప్పి కొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు సీహెచ్‌ బాబురావు పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్రకు సంఫీుభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్‌ అమరావతిని మరింత మెరుగ్గా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి, నేడు మడమ తిప్పటం సరికాదన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ తీర్పుని బేఖాతరు చేయటం శోచనీయమన్నారు. మోదీ ప్రభుత్వం చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకుందని, విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని, తక్షణమే నిధులు మంజూరు చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.
దండయాత్ర కాదు… ధర్మయాత్ర: తులసి రెడ్డి
అమరావతిలో ఇప్పటికే ఉన్న సచివాలయాన్ని అక్కడే కొనసాగించి విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా, ఐటీ రాజధానిగా, చలనచిత్ర రాజధానిగా, పర్యాటక రాజధానిగా అభివృద్ది చేయాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాడి బుందేల్‌ఖండ్‌్‌ తరహా అభివృద్ధి ప్యాకేజీ తెప్పించాలని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయాలని, విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.రైతులది దండయాత్ర కాదని, ధర్మయాత్ర అని వైసీపీ నేతలకు హితవు చెప్పారు.
ఇంకా ఈ పాదయాత్రలో తెలంగాణా కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి, బీజేపీ నాయకులు కామినేని శ్రీనివాస్‌, చలసాని శ్రీనివాస్‌, గద్దె అనురాధ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్‌, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాస్‌, అమరావతి ఉద్యమ జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పువ్వాడ సుధాకర్‌, కొలికపూడి శ్రీనివాస్‌, పోతుల బాలకోటయ్య, రాయపాటి శైలజ తదితరులు పాల్గొన్నారు. రేణుకా చౌదరి కొద్దిసేపు రథాన్ని నడిపి పాదయాత్రలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు.
మంగళగిరిలో ముగిసిన తొలిరోజు పాదయాత్ర
ఎర్రబాలెంలో భోజన విరామం తీసుకున్న రైతులు మధ్యాహ్నం తర్వాత యాత్రను తిరిగి ప్రారంభించారు. తొలిరోజు 29 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా పాదయాత్ర మంగళగిరి చేరుకుంది. 12 గంటలపాటు 15 కిలోమీటర్ల మేర నడిచి మంగళగిరి చేరుకున్న రైతులకు స్థానికులు పూలతో స్వాగతం పలికారు. మంగళగిరిలోనే బసచేయనున్న రైతులు మంగళవారం అక్కడి నుంచే రెండో రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img