తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పల్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి తెలంగాణకు నాయకులయ్యారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు కల్లు తాగిన కోతిలా, ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి కానీ ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా బిడ్ వేస్తామని అంటారా అని హరీశ్ రావును నిలదీశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ అని మార్చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా అని ప్రశ్నించిన మంత్రి అప్పల్రాజు.. కేసీఆర్ కుటుంబంలో జాతీయవాదం అనేది ఏ కోశానా లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, కరోనా కష్టకాలంలో మీ బంగారు తెలంగాణలో మీరు వెలగబెట్టింది ఏంటనేది మాకు తెలుసని మంత్రి అప్పల్రాజు తీవ్ర విమర్శలు చేశారు. మీ నిర్వాకం మొత్తం మేము టీవీల్లో, పేపర్లలో చూశామని మంత్రి చెప్పారు. ాఒళ్లు కొవ్వెక్కి మాట్లాడడం అభివృద్ధి కాదు. ఆంధ్రుల కష్టంతో.. కేవలం ఆంధ్రుల కష్టంతో బ్రహ్మాండమైన నగరంగా మారినటువంటి హైదరాబాద్ ను ఉన్నపళంగా విడిచిపెట్టి వచ్చాం. దీనికి తోడు ఇక్కడ మాకు చంద్రబాబు దరిద్రం ఒకటి మాకు. మాకు లేనిదల్లా ఒకటే.. మీ మామలాగా ఫాంహౌజ్ లో కూచుని కల్లు తాగడం లేదిక్కడ. లేకపోతే పాపం కవితక్కలాగా సీక్రెట్ చాట్స్ లేవు. మా దగ్గర మీలాగా లిక్కర్ స్కాంలు లేవు. మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నేను హరీశ్ రావును కోరుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వీలైతే ఆపాలి. సిగ్గూఎగ్గూ లేకుండా ప్రైవేటీకరణ చేస్తే మేం బిడ్ వేస్తామని చెబుతావా? అంటే ఏంటి దానర్థం? ప్రైవేటీకరణకు నువ్వు అనుకూలమా, వ్యతిరేకమా?్ణ అంటూ హరీశ్ రావుపై మంత్రి అప్పల్రాజు మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకుంటే మీ పార్టీ జాతీయ పార్టీ అయిపోతుందా? జాతీయవాదం అనేది ఏ కోశాన్నైనా మీ కుటుంబంలో ఉందా? మీరు ప్రాంతీయ ఉగ్రవాదులు. మీరు, మీ మామ, మీ మామ కొడుకు, మీ మామ కూతురు.. అందరూ ప్రాంతీయ ఉగ్రవాదులు. ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి తెలంగాణకు నాయకులయ్యారు. ఏముంది మీ పార్టీలో?్ణ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఏపీ మంత్రి అప్పల్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.