. టచ్‌లో మరికొందరు ఎమ్మెల్యేలు
. ఆందోళనలో వైసీపీ
. ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ..?
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వచ్చే ఎన్నికల్లో 175/175 సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉన్న వైసీపీని ఎమ్మెల్యేల తిరుగుబాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలపై ఆర్భాటంగా సస్పెన్షన్ వేటు వేసిన వైసీపీకి లోలోన ఆందోళన మొదలైంది. మరికొంతమంది టీడీపీతో టచ్‌లో ఉన్నారనే సమాచారం కలవరం పుట్టిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలుస్తామని భావించినప్పటికీ ఒకటి టీడీపీ ఖాతాలో చేరింది. వైసీపీకి కేవలం 6 స్థానాలే దక్కాయి. ఈ ఫలితాలు వైసీపీ పతనానికి నాందిగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఫలితాలతోపాటు సొంత పార్టీలోనూ అసమ్మతి బెడద పెరగడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు దిక్కుతోచడం లేదు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం…ఆ ఓట్లతోనే టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు వైసీపీ అధిష్ఠానానికి మింగుడు పడటం లేదు. ఫలితాలు వెలువడిన 24 గంటల్లోనే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరు రూరల్), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(ఉదయగిరి), ఆనం రామనారాయణరెడ్డి(వెంకటగిరి), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ)ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటికే టీడీపీతో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించిన విషయం విదితమే. దాని ఆధారంగా వైసీపీలో ఇంకా 12 మంది గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించేనాటికి ఆ సంఖ్య 30కి చేరే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. వైసీపీలో అసమ్మతివాదులపై టీడీపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవులు రాక అసంతృప్తిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీ నుంచి దూరం చేసేలా టీడీపీ వ్యూహం పన్నింది. మరో అసమ్మతి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దూరమవ్వడంలో టీడీపీ పాత్ర ఉన్నట్లు ప్రచారముంది.
కోటంరెడ్డి, ఆనం చేరికకు టీడీపీ ఓకే
కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డికి టీడీపీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో రాజకీయ సునామీ వస్తుందని, వైసీపీ శాశ్వతంగా డిస్మిస్ అవుతుందని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘంటాపదంగా చెబుతున్నారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై ఇంకా స్పష్టత లేదు. ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మేకపాటి తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసి బెంగళూరు వెళ్లారు. మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అందుబాటులో లేరు. చివరి రోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా వారిద్దరూ హాజరు కాలేదు. ఉండల్లి శ్రీదేవి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఓటేసే ముందు వారిద్దరూ వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను కలిసి వచ్చే ఎన్నికల్లో టికెట్లపై గట్టిగా పట్టుపట్టగా…ఇవ్వలేనని జగన్ తేల్చిచెప్పినట్లు సమాచారం. దీనితో వారు క్రాస్ ఓటింగ్ చేసినట్లు ప్రచారముంది. మరోవైపు, డబ్బులకు అమ్ముడుపోయే వారు టీడీపీకి అనుకూలంగా ఓటేసినట్లు వైసీపీ అధిష్ఠానం విమర్శించింది. జగన్‌పై సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసినట్లు స్వయానా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. వైసీపీ పతనం తథ్యమని, టీడీపీ అన్‌స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా మేకపాటి, ఉండల్లి శ్రీదేవి టీడీపీ గూటికి వెళ్తారనే ప్రచారముంది. కాగా, శ్రీదేవికి వ్యతిరేకంగా తాడికొండలోని ఆమె పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను కార్యకర్తలు చించివేశారు.