Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

టెన్షన్‌…టెన్షన్‌

. వైసీపీ ఎమ్మెల్యేల్లో భయం
. టికెట్లపై తేలనున్న భవితవ్యం
. పనితీరు బాగోని వారికి మొండిచేయి
. నేడు వైసీపీ ముఖ్యనేతలు, సమన్వయకర్తలతో జగన్‌ సమావేశం
. కేబినెట్‌`3.0, ముందస్తు ఎన్నికలపై నిర్ణయం?
. జగనన్నే మన భవిష్యత్‌పై దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ మొదలైంది. వైసీపీ ముఖ్యనేతలు, ప్రాంతీయ, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నిర్వహించబోయే సమావేశం కలవరం రేపుతోంది. సమావేశంలో ప్రధాన అజెండాగా పనితీరు సరిగాలేని ఎమ్మెల్యేలకు చెక్‌ పెట్టడం, కేబినెట్‌ 3.0 విస్తరణ, ముందస్తు ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలన, పార్టీశ్రేణులను సమాయత్తం చేయడం వంటి చర్యలకు ఆయన సిద్ధమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశం కీలకంగా నిలవనుందని భావిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల భవితవ్యానికి ఇది వేదిక కానుంది. ఇప్పటికే రెండు విడతలుగా దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్‌ అత్యవసరంగా భేటీ అయ్యారు. కేవలం 15 రోజుల్లోనే రెండుసార్లు సీఎం దిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ కేసుల వ్యవహారంతోనే సీఎం దిల్లీ వెళ్లారంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఇప్పటివరకు జగన్‌ నిర్వహించిన వివిధ సమీక్షలతో చాలామంది ఎమ్మెల్యేల పనితీరు బాగోనందున, వారికి టికెట్లు రావనే సంకేతాలను అధినేత ఇచ్చారు. దానిని గమనించిన ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడటం, రాజకీయ భవిష్యత్‌ కోసం ఇతర పార్టీల్లో చేరికకు సిద్ధమయ్యారు. పనితీరు బాగాలేదని, సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగురవేయడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లను నియమించారు. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గంలోనూ ఇన్‌చార్జ్‌ని నియమించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. అధిష్ఠానం ఒంటెత్తు పోకడలపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం, గృహ సారథుల అంశాలపైనా పార్టీ తరపున నిర్ణయం తీసుకోనున్నారు. జగనన్నే మన భవిష్యత్‌ క్యాంపెయిన్‌పైనా పార్టీ శ్రేణులకు జగన్‌ దిశానిర్దేశం చేస్తారు.
అపాయింట్‌మెంట్‌ లేక ఎమ్మెల్యేల పడిగాపులు
నాలుగేళ్ల నుంచి సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్లు లేనందున సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సమయంలో స్థానికంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే అవకాశం లేక ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నియోజకవర్గానికి నిధుల నుంచి అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాటిని సీఎం జగన్‌ను కలిసి చెప్పుకునే అవకాశం లేక… సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకక పడిగాపులు పడుతున్నారు. దానికితోడు వలంటీర్ల వ్యవస్థతో ఎమ్మెల్యేలకు ప్రజలతో సంబంధం లేకుండా పోయిందని, తామంతా ఉత్సవ విగ్రహాల్లా ఉన్నామంటూ కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నట్లు సమాచారం. జిల్లా మంత్రులు, పరిశీలకులకు, ఎంపీలకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఎమ్మెల్యేలు ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియని దుస్థితి నెలకొంది. ఎక్కడికక్కడే జిల్లాల్లో పార్టీ మధ్య గ్రూపులు ఏర్పడటంతో ద్వితీయ, తృతీయశ్రేణి నాయకత్వానికి గుర్తింపు లేకుండా పోయింది. దీంతో వారంతా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలతో కలిసి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
40 మందికి టికెట్లు కష్టమే?
రాబోయే ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్‌లకు టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. దీనిపై పార్టీ ముఖ్యనేతల సమావేశంలో సీఎం జగన్‌ తేల్చిచెబుతారని సమాచారం. గడపగడపకూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు సరిగ్గా నిర్వహించలేకపోయారు. దీంతో వారి పనితీరుపై గత సమావేశాల్లో సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కష్టమేనంటూ నేరుగా అందరి ముందూ నొక్కిచెప్పారు. దాంతో కొందరు అసంతృప్తి చెందారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. వారంతా టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. 40 మంది సిట్టింగ్‌లకూ టికెట్లు ఇవ్వకుంటే వారంతా అధిష్ఠానంపై తిరగబడే అవకాశముంది. అలాంటి వారిని గుర్తించి ముందు సర్దిచెప్పడం…లేకపోతే తెగేసి చెప్పే రీతిలో జగన్‌ ఉన్నట్లు సమాచారం.
కేబినెట్‌ 3.0 ఉండేనా?
రాష్ట్ర కేబినెట్‌లో కొంతమంది మంత్రుల పని తీరుపై జగన్‌ అసంతృప్తిగా ఉన్నారు. దీంతోపాటు రెండో విడత కేబినెట్‌లో క్షత్రియ, కమ్మ, ఆర్యవైశ్య సామాజిక వర్గాలకు చోటు దక్కలేదు. ఆ కేబినెట్‌ కూర్పుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీనిని గుర్తించిన సీఎం…రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్‌లో స్వల్పమార్పులు చేసి, ముగ్గురికి చోటు కల్పిస్తారని సమాచారం. పనితీరు బాగోని మంత్రులను తొలగించి, వారి స్థానంలో కొత్త వారికి స్థానం కల్పించే అవకాశాలున్నాయి.
శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల బలం 43కు చేరింది. శాసనమండలి నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం కల్పించేలా అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కమ్మ సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్‌కు అవకాశం కల్పిస్తారని సమాచారం. మొత్తంగా వైసీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో జరగనున్న సమావేశం కీలక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img