Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ట్విట్టర్‌ దివాలా తీయకుండా కాపాడుకున్నా : ఎలాన్‌ మస్క్‌

గత మూడు నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయన్న మస్క్‌
త్వరలో లాభాల బాట పడతామన్న మస్క్‌

ట్విట్టర్‌ దివాలా తీయకుండా కాపాడానని ఎలాన్‌ మస్క్‌ తాజాగా పేర్కొన్నారు. గత మూడు నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయని చెప్పుకొచ్చారు. ఓవైపు ట్విట్టర్‌, మరోవైపు టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల కార్యకలాపాలు ఏకకాలంలో పర్యవేక్షించాల్సి వచ్చిందని వివరించారు. ట్విట్టర్‌ వేదికగా తన మనోభావాలు పంచుకున్న మస్క్‌.. ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలున్నాయని అన్నారు. ట్విట్టర్‌లో తనకు ఎదురైన కఠినపరిస్థితి శత్రువులకు కూడా రాకూడదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్విట్టర్‌ ఆదాయం బ్రేకీవెన్‌ స్థితికి చేరుకుందని చెప్పిన ఆయన.. ఇదే పంథాలో సంస్థ కొనసాగితే త్వరలో లాభాలబాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ కొనుగోలు చేసిన తొలి నాళ్లలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన పలు విషయాలు ప్రస్తావించారు. 44 బిలియన్‌ డాలర్లకు సంస్థను తాను కొన్న తొలి వారంలోనే ఆదాయం భారీగా పడిపోయిందని వాపోయారు. అడ్వర్టయిజర్లపై కొందరు తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే దీనికి కారణమని వివరించారు. నాటి నుంచి తాను ట్విట్టర్‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చి సంస్థను కాపాడుకున్నానని చెప్పారు. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నాక మస్క్‌ సంస్థలో సగం మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇక బ్లూ టిక్‌ సర్వీసును పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌గా కూడా మార్చారు. అంతేకాకుండా.. సంస్థ ప్రయాణంలో కీలక మైలురాళ్లకు సంబంధించిన పలు జ్ఞాపికలను కూడా ఆయన వేలం వేశారు. ట్విట్టర్‌ రోజుకు 4 మిలియన్‌ డాలర్ల మేర నష్టపోతోదంటూ అప్పట్లో ఆయన తన చర్యలను సమర్ధించుకున్నారు. కాగా.. ట్విట్టర్‌ ఏపీఐ సేవలను థర్డ్‌ పార్టీ యాప్‌ రూపకర్తలకు ఇచ్చేందుకు త్వరలో కొంత చార్జీలు వసూలు చేస్తామని కూడా సంస్థ ఇటీవల ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img