Friday, September 22, 2023
Friday, September 22, 2023

డిగ్రీ అభ్యర్థుల ఆందోళన

ఆగస్టులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌
మరో రెండేళ్లూ గ్రూప్స్‌ అరకొరే
పోస్టుల పెంపుపై సర్కారు మౌనం
క్రమంగా లేని నోటిఫికేషన్లు
ప్రిపరేషన్‌పై నిరుద్యోగుల్లో గందరగోళం
వయస్సు ఆవిరైపోతోందని ఆవేదన

విశాలాంధ్ర బ్యూరో అమరావతి : డిగ్రీ అర్హతగల అభ్యర్థుల్లో ఆందోళన, అయోమయం నెలకొంది. జాబ్‌ క్యాలెండరులో ఉద్యోగాలు సరిగా లేనందున నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ అభ్యర్థుల కోసం ఏపీపీఎస్సీ సక్రమంగా నోటిఫికేషన్లు ప్రకటించకపోవడంతో అభ్యర్థుల వయస్సు ఆవిరైపోతోంది. 2007 నుంచి ప్రభుత్వాలు ఇదేవిధంగా వ్యవహరిస్తూ, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఎన్నికల ముందూ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక.. మొక్కుబడిగా, అరకొర పోస్టులతోనే నోటిఫికేషన్లు జారీజేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండరులో డిగ్రీ పట్టభద్రులకు ఉపయుక్తమైన పోస్టులు లేవు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. డిగ్రీ, పీజీలు చదివి, ఎలాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు అభ్యసించని వారంతా దాదాపు 70 శాతానికిపైగా అభ్యర్థులుంటారు. వారంతా ఏపీపీఎస్సీ ద్వారా వచ్చే గ్రూప్‌1,2, ఇతర పోస్టులపైనే నమ్ముకుని ప్రిపరేషన్‌ కొనసాగిస్తారు. ఎంతో కాలం నుంచి లక్షలాది రూపాయల ఖర్చుతో కోచింగ్‌లు తీసుకుని నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వేచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ అతి తక్కువ పోస్టులతో గ్రూప్స్‌ పోస్టులను కేటాయించడంపై తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జాబ్‌ క్యాలెండరులో ప్రభుత్వం ప్రకటించిన 36 గ్రూప్స్‌ పోస్టుల కోసం ప్రిపరేషన్‌ కొనసాగించాలా..? లేక ఆపేయాలా అనేది తెలియని దుస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఖాళీలు కలిపి నూతన జాబ్‌ క్యాలెండరు విడుదల చేయాలని నిరుద్యోగులకు అండగా విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన బాటపట్టాయి. వారికి ప్రతిపక్ష

పార్టీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అయితే ఇంతవరకూ ప్రభుత్వం స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
గ్రూప్స్‌1,2 నోటిఫికేషన్ల తీరిదీ..! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ ద్వారా 2007లో గ్రూప్‌1,2 నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్‌లో పోస్టులు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత 2011లో గ్రూప్స్‌1,2లకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీజేసింది. ఏడాది గ్యాప్‌తో 2012లో, ఐదేళ్ల గ్యాప్‌తో 2017, రెండేళ్ల గ్యాప్‌లో 2019లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో ప్రస్తుతం ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్స్‌1,2లకు 36 పోస్టులను విడుదల చేశారు. 2011లో గ్రూప్స్‌ జాబ్‌ సాధించిన వారికి 2013ఏప్రిల్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. 2012లో గ్రూప్స్‌లో ఎంపికైన వారికి 2013ఆగస్టులో పోస్టింగ్‌ కేటాయించారు. ఎంపికలోనూ తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీంతో అభ్యర్థుల సర్వీసులో సీనియార్టీలోనూ నష్టపోతున్నారు. యూపీపీఎస్సీ తరహా ప్రమాణాలను ఏ మాత్రం పాటించడం లేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రాబోయే 2022, 2023లోనూ ఇదే తరహాగా గ్రూప్స్‌ పోస్టులు ఉంటాయని అంచనా. ఎన్నికల చివరి ఏడాదిలో గ్రూప్స్‌ పోస్టులు పెంచుతారనే ప్రచారముంది. ఈలోగా అభ్యర్థుల వయస్సు పెరిగిపోయి ఉద్యోగాలకు అనర్హులవుతారు. అతి తక్కువ పోస్టులు, లక్షలాది మంది పోటీలో ఉండటంతో అతి తక్కువ మందికే అవి దక్కనున్నాయి.
తక్కువ పోస్టులతో నిరుద్యోగుల నిరాశ
ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ పోస్టులు తక్కువగా ఉండటంతో ప్రిపరేషన్‌పై నిరుద్యోగుల్లో గందరగోళం ఏర్పడిరది. జాబ్‌ క్యాలెండరులో గ్రూప్స్‌ పోస్టులు ఆశాజనకంగా ఉంటాయని ఆశించిన అభ్యర్థులు భంగపాటుకు గురయ్యారు. త్వరలో గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ క్రమంలో అతి తక్కువ పోస్టులకు ప్రిపరేషన్‌ చేయడానికి చాలా మంది నిరుద్యోగుల ఆసక్తి చూపడం లేదు. గ్రూప్స్‌ పోస్టులలో విజయం సాధించిన ఎక్కువ మందిని పరిశీలిస్తే.. రెండు, మూడు సార్లు పరీక్షకు హాజరైన వారే ఉన్నారు. ఒకేసారి గ్రూప్స్‌ పోస్టులు కొట్టడం చాలా అరుదు. అలాంటి పరిస్థితుల్లో ఒక క్రమ పద్ధతి లేకుండా 2007 నుంచి ఇష్టానుసారంగా జాబ్‌ క్యాలెండరు విడుదల చేయడంతో లక్షలాది మంది అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారు. వారిలో వయోపరిమితి మించి పోయిన వాళ్లే అధికంగా ఉన్నారు. ఏపీలో రెండేళ్ల తర్వాత జాబ్‌ క్యాలెండరును ప్రభుత్వం ప్రకటించి, అందులో గ్రూప్స్‌కు 36 పోస్టులే కేటాయించడంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది. నిరుద్యోగుల ఆవేదన, ఆందోళనను ప్రభుత్వం గుర్తెరిగి తక్షణమే గ్రూప్స్‌లో 1,000 పోస్టులు పెంచాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img