న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని మూడు అంతస్థుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పలువురు మృతి చెందారు. ఇప్పటి వరకు 26 మృతదేహాలను వెలికి తీశారు. మరో 30 మందికి పైగా కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 24 ఫైరింజిన్లు సుదీర్ఘంగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి. ఈ వాణిజ్య భవనం పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో ఉంది. భవనం నుంచి 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ భవనాన్ని సాధారణంగా కంపెనీలకు ఆఫీస్ స్పేస్ అందించేందుకు ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అవుటర్) సమీర్ శర్మ తెలిపారు. అయితే ఒక అంతస్తులో ఇంకా వెతకాల్సి ఉందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4.40 గంటలకు మంటలు చెలరేగడంతో సమాచారం అందడంతో 20 ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపింది. ఆ తర్వాత మరో నాలుగు ఫైరింజిన్లు వచ్చాయన్నారు.
ప్రమాద ఘటన బాధాకరం – రాష్ట్రపతి, ప్రధాని
‘ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంతో బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యాలయం ట్వీట్ చేసింది.
‘ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.