ఢిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టులో కాల్పులు కలకలం రేపాయి. కోర్టు కాంప్లెక్స్ లో ఒక మహిళపై దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తం నాలుగు రౌండ్లు ఫైర్ చేశారు. కాల్పుల్లో గాయపడిన మహిళను అక్కడే ఉన్న ఒక పోలీసు అధికారి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒక ఆర్థిక వివాదానికి సంబంధించిన కేసు విచారణ నేపథ్యంలో బాధితురాలు కోర్టుకు వచ్చారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కోర్టు ప్రాంగణంలోని అడ్వొకేట్స్ బ్లాక్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కోర్టుకు చేరుకున్న క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలిని పరిశీలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుడు న్యాయవాది దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.