. 90 శాతం సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం : పదేళ్లుగా వర్షాలు లేక నష్టపోయిన రైతులకు వెంటనే రూ.20 వేల నష్టపరిహారంతో పాటు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామంలో పంట పరిశీలన కార్యక్రమంలో భాగంగా అన్నగిరి ఆంజనేయులు పొలంలో కంది పంటను రామకృష్ణ పరిశీలించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కేరళతో పాటు ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడు తుంటే… రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, కడప, కర్నూలు జిల్లాలు వర్షాలు లేక ప్రజలు ఇబ్బందు పడుతున్నారని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంట సాగు చేయలేదని తెలిపారు. ఎక్కడైనా విత్తనాలు నాటితో…వర్షాలు లేక రైతులు నష్టపోయారన్నారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినా సాగు చేసే పరిస్థితి లేదని, అందువల్ల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం సాయమందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి రెండు నెలలు అయినా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదని రామకృష్ణ చెప్పారు. తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం డ్యామ్‌లో నీరు పుష్కలంగా ఉన్నాయని, అందువల్ల హంద్రీనీవా కెనాల్, పీఏబీఆర్ కెనాల్‌కి పూర్తిస్థాయిలో నీటినందించి చెరువులు నింపాలన్నారు. చెరువులు నిండితే తోట బావులు, మోటర్ బావులకు నీరు వచ్చి రైతులు పంటలు పెట్టుకోవడానికి వీలవుతుందన్నారు. వ్యవసాయ కూలీలకు యుద్ధ ప్రాతిపదికన ఉపాధి పనులు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజగదీశ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య, అనంతపురం జిల్లా కార్యదర్శి సి.జాఫర్, సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజారెడ్డి, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి పి.రామకృష్ణ, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వైఎల్ రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు బుల్లె నగేశ్, మన్నీల సీపీఐ నాయకులు వెంకట్ రాముడు, చిన్న వెంకటరాముడు, శివ, ఆంజనేయులు, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.