వరద బాధితులపై నిర్లక్ష్యం తగదు
చెరువుల కబ్జాతో తిరుపతికి ముప్పు
ప్రభుత్వంపై రామకృష్ణ ఆగ్రహం
తిరుపతి, రైల్వే కోడూరుల్లో సీపీఐ బృందం పర్యటన
బాధితులకు అండగా ఉంటామని భరోసా
విశాలాంధ్ర బ్యూరో`తిరుపతి/రైల్వేకోడూరు : వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ ప్రతినిధి బృందం డిమాండు చేసింది. వరదలతో అతలాకుతలమైన చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రతినిధి బృందం బుధవారం పర్యటించింది. బాధితులతో మాట్లాడిరది. వరదలకు జరిగిన నష్టాన్ని చూసి చలించిపోయింది. బాధితుల ఇక్కట్లను అడిగి తెలుసుకుంది. సీపీఐ ప్రతినిధి బృందానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నాయకత్వం వహించారు. ముంపు బాధితులకు తక్షణమే రూ.5 వేల సాయం అందజేయాలని రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం తిరుపతి నగరం వరద ముంపు ప్రాంతాల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథ్‌రెడ్డి, జిల్లా, నగర నాయకుల బృందం పర్యటించింది. ఆటోనగర్, కొరమెను గుంట, దేముడు కాలనీ తదితర ప్రాంతాలను పరిశీలించింది. దేముడు కాలనీలో పేదలకు అన్నదానం చేసింది. అనంతరం కె.రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల చెరువులన్నీ ఆక్రమణకు గురికావడంతో నగరం మొత్తం ముంపునకు గురైందన్నారు. కొరమేను గుంట చెరువును సైతం ఆక్రమించుకునేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి వారిపై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో తిరుపతి పురవీధులు జలమయమయ్యాయని, ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ అన్నారు. స్మార్ట్ సిటీ తిరుపతి అని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ముంపు బాధితులకు మూడు సెంట్ల భూమి కేటాయించి, పక్కాగృహాలు నిర్మించాలన్నారు. రామకృష్ణ వెంట ముప్పాళ్ల, హరినాథ్‌రెడ్డి సహా చిత్తూరు పార్టీ నాయకులు మురళి, విశ్వనాథ్, రాధాకృష్ణ, రవి, శ్రీరాములు, మంజుల, నదియ, రత్నమ్మ, విజయ, శివారెడ్డి, కృష్ణ, పద్మనాభరెడ్డి, బాబు, బాషా, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లాలో…
వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండల కేంద్రం నరసరాంపేటలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరినాథ్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య తదితరులతో కలిసి రామకృష్ణ పర్యటించారు. ‘మాకు మీరే న్యాయం చేయాలి’ అంటూ నరసరాంపేట బాధితులు సీపీఐ బృందానికి విజ్ఞప్తి చేశారు. సీపీఐ పేదలకు అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని రామకృష్ణ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రక్షణగోడలు, కల్వర్టులు, రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, సీపీఐ నాయకులు ఎస్.శంకరయ్య, పండుగోల మణి, జ్యోతి చిన్నయ్య, తిప్పన ప్రసాద్, కేశం ప్రసాద్, హరికృష్ణ, దాసరి జయచంద్ర, పండుగోల వేదాంత్ తదితరులు పాల్గొన్నారు.