Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

తాత్కాలిక విరామం

. కోర్టులోనే తేల్చుకుంటాం
. పండగ తర్వాత పునరుద్ధరణ

విశాలాంధ్ర - రామచంద్రాపురం : పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి చైర్మన్‌ ఏ శివారెడ్డి, కోకన్వీనర్‌ తిరుపతిరావు ప్రకటించారు.ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడిరచారు. కోర్టుకు సెలవులు ఉన్నందున పాదయాత్రకు నాలుగు రోజులు తాత్కాలిక విరామమేనని ఐక్య కార్యాచరణ సమితి పేర్కొంది. అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్‌ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రైతులు బస చేస్తున్న ఫంక్షన్‌ హాల్‌ను శనివారం ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. రైతులను కలిసి మద్దతు తెలిపేందుకు బయటనుంచి వచ్చే వారిని సైతం అనుమతించలేదు. సంఫీుభావం తెలిపేందుకు వస్తున్నవారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపించాలని,. అనుమతి ఉన్న వాహనాలు కాకుండా మిగతావి అంగీకరించబోమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రైతులు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఐక్య కార్యాచరణ నేతలు సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘పోలీసులు మహిళలను తీవ్రంగా గాయపరిచారు. మహిళల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా పోలీసు, ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.
పాదయాత్రకు తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించాం. తదుపరి కార్యాచరణ చర్చించి ప్రకటిస్తాం. ఎదురౌతున్న అడ్డంకులన్నింటినీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగానే తాత్కాలిక విరామం ప్రకటించాం. కోర్టు మార్గదర్శకాలతో అరసవల్లి వరకు పాదయాత్రను కొనసాగిస్తాం’’ జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: తాటిపాక మధు
శాంతియుతంగా జరుగుతున్న రైతుల మహాపాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, దాట్ల బుచ్చిరాజు, 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర గణేశ్‌ బాబు, సీపీఐ జిల్లా నేతలు కే బోడకొండ, తోకల ప్రసాద్‌, పి.సత్యనారాయణ, పి.రాము తదితరులు రైతుల పాదయాత్ర వద్దకు వెళ్లి శివారెడ్డి, దత్త తిరుపతిరావును కలిసి సంఫీుభావం ప్రకటించారు. అనంతరం అఖిలపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లా అంటే ప్రశాంత రాజకీయ చైతన్యానికి మారుపేరని, నేడు వైసీపీ ప్రభుత్వం అలజడి సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా జరుగుతున్న పాదయాత్రను 400 మంది పైగా పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల మహాపాదయాత్రను ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు.
పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారు: అమరావతి జేఏసీ
అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నాడని ఏ శివారెడ్డి, తిరుపతిరావు దుయ్యబట్టారు. న్యాయస్థానం అంటే తమకు గౌరవం ఉందని వారు పేర్కొన్నారు. పోలీసులు తీరుపై కోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడిరచారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పాదయాత్ర జరిగి తీరుతుందని, అరసవల్లి చేరుతామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img