Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం

. విజయవాడలో దేవినేని అవినాష్‌ నివాసం
. హైదరాబాద్‌ ‘వంశీరామ్‌’లో సోదాలు
. బంజారాహిల్స్‌ భూమి లావాదేవీలే కారణమని ప్రచారం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి/హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం 6.30 నుంచే అటు హైదరాబాద్‌తోపాటు, ఇటు విజయవాడ, నెల్లూరు నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో దాదాపు 20పైగా బృందాలు పాల్గొన్నట్లు సమాచారం. హైదరాబాద్‌ వంశీరామ్‌ బిల్డర్స్‌ ప్రధాన కార్యాలయాలతో పాటు డైరెక్టర్‌ ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. నందగిరి హిల్స్‌లోని వంశీరామ్‌ బిల్డర్‌ చైర్మన్‌ సుబ్బారెడ్డి నివాసంలోనూ తనిఖీలు సాగాయి. అలాగే పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గరున్న కార్పొరేట్‌ కార్యాలయంలో, జూబ్లీహిల్స్‌లోని సుబ్బారెడ్డి బావబారిది జనార్ధన్‌రెడ్డి నివాసంలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 15 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. గత 25 సంవత్సరాలుగా వంశీరామ్‌ బిల్డర్స్‌ నిర్మాణ రంగంలో ఉండగా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వంశీరామ్‌ బిల్డర్స్‌ 85 ప్రాజెక్టులు పూర్తి చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఏడు భారీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడుతునట్లు సమాచారం. ఇటీవల చేవెళ్లలో 250 ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించింది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్స్‌తో పాటు గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్స్‌ వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వంశీరామ్‌ బిల్డర్స్‌ భారీగా లాభాలు ఆర్జించినట్లుగా తెలుస్తోంది. లాభాలు తక్కువగా చూపి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన లాభాలను తక్కువగా చూపి ఆ నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టరాని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉదయం ఆరున్నర గంటలకు 15 చోట్ల ఏకకాలంలో సోదాలు ప్రారంభించింది. ఇప్పటికే పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ నగరంలోని గుణదలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దేవినేని అవినాష్‌ స్వగృహంలోనూ సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉదయం ఆరున్నర గంటలకే ఐటీ అధికారులు దాడులు ప్రారంభించడంతో వైసీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో దేవినేని అవినాష్‌ స్వగృహానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు గేట్లు మూసేసి సోదాలు జరిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అకస్మాత్తుగా అవినాష్‌ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img