Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

తొక్కేయాలని చూస్తే దీటుగా బదులిస్తాం

బీజేపీ దురహంకారాన్ని అణచివేయాలి
సంకల్ప్‌ సత్యాగ్రహంలో కాంగ్రెస్‌ నేతలు
. రాహుల్‌పై అనర్హత వేటుకు దేశవ్యాప్తంగా ‘నిరశన’లు
. అనేక రాష్ట్రాల్లో కార్యకర్తలు, నాయకుల అరెస్టులు

న్యూదిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దురహంకారాన్ని అణచివేయాలని సంకల్ప్‌ సత్యాగ్రహం వేదిక నుంచి కాంగ్రెస్‌ అగ్రనేతలు పిలుపునిచ్చారు. మమ్మల్ని తొక్కేయాలని చూస్తే దీటైన బదులిస్తామని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజల పక్షాన దేశం కోసం పోరాడే వ్యక్తిని శిక్షించి, దేశాన్ని దోచుకునే వారిని విదేశాలకు పంపుతున్న మోదీ ప్రభుత్వానికి నేరస్తులపై మక్కువెందుకో చెప్పాలని నిలదీశారు. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ వంటి నేరగాళ్లను విమర్శిస్తే అధికార బీజేపీకి బాధ ఎందుకంటూ ప్రశ్నించారు. ‘ఇది ఒక్క సత్యాగ్రహమే ఇలాంటివి దేశవ్యాప్తంగా అనేకం జరుగుతాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, వాక్‌స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోం’ అని కాంగ్రెస్‌ నాయకులు ఉద్ఘాటించారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‘సంకల్ప్‌ సత్యాగ్రహం’ పెద్దఎత్తున జరిగింది. అనేక రాష్ట్రాల్లో నేతలు, కార్యకర్తలు అరెస్టుకు గురయ్యారు. కాగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద సత్యాగ్రహానికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినాగానీ గాంధీ స్మారకం వద్ద 24గంటల నిరశనను కాంగ్రెస్‌ చేపట్టింది. అటు గుజరాత్‌లో అనేక మంది పార్టీ కార్యకర్తలు, నాయకులను ఆ రాష్ట్ర పోలీసులు నిర్బంధించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సత్యాగ్రహాలు జరిగాయి. కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఆయా కార్యక్రమాలను జయప్రదం చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్‌ తహార్‌, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అమిత్‌ చావ్డ, సీనియర్‌ నేత భరత్‌సిన్హ సోలంకితో పాటు అనేక మంది కార్యకర్తలను అహ్మదాబాద్‌లోని లాల్‌ దర్వాజ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసు మైదానానికి తరలించగా వారు ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సత్యమే మా బలం… సత్యాగ్రహమే మా సంకల్పం. బీజేపీ లూటీని బట్టబయలు చేసేందుకు, ప్రజాస్వామ్యానికి పరిరక్షించేందుకు ఉక్కునిశ్చయంతో ఉన్నాం. గుజరాత్‌లోని ప్రతి ఒక్క కార్యకర్త… రాహుల్‌ గాంధీ వెంట ఉంటారు’ అని థకోర్‌ పేర్కొన్నారు. శ్రీనగర్‌లో జేకేపీసీసీ మాజీ అధ్యక్షుడు గులాం అహ్మద్‌మీర్‌ ఆధ్వర్యంలో ఎంఏ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదు బీజేపీయేతర లౌకికపార్టీలన్నీ ముక్తకంఠంతో మొరపెట్టుకుంటున్నాయని విలేకరులతో అహ్మద్‌ మీర్‌ అన్నారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏమీ లేదని, ప్రతి చర్య చట్టవ్యతిరేకం, అప్రజాస్వామికమైనదేనన్నారు. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లోనూ సత్యాగ్రహ కార్యక్రమాలు జరిగాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి చెందిన రాహుల్‌ గాంధీ నోరు నొక్కేయగలమని బీజేపీ పగటి కలలు కంటోందని నేతలు వ్యాఖ్యానించారు. అటు దిల్లీలో రాజ్‌ఘాట్‌ వద్ద సత్యాగ్రహంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర ముఖ్యనేతలు పాల్గొని బీజేపీ నిరంకుశత్వాన్ని దుయ్యబట్టారు. నిరంకుశదురహంకార ప్రభుత్వంపై గళమెత్తేందుకు సమయం ఆసన్నమైందని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. రాహుల్‌ని ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధించడం దేశానికిగానీ ప్రజాస్వామ్యానికిగానీ మంచిది కాదన్నారు. ఖడ్గే మాట్లాడుతూ ఓబీసీలను అవమానించినట్లు రాహుల్‌పై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ‘వాళ్లు (బీజేపీ) ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. లలిత్‌ మోదీగానీ నీరవ్‌మోదీగానీ మేహుల్‌ చోక్సీగానీ ఓబీసీవారా? ఆర్థిక నేరగాళ్ల (లలిత్‌నీరవ్‌ మోదీ)ను విమర్శిస్తే అధికార పక్షానికి ఉలుకెందుకని ప్రశ్నించారు. దేశం కోసం పనిచేసే వ్యక్తిని శిక్షిస్తారు… దేశాన్ని లూటీ చేసేవారిని విదేశాలకు పంపుతారని ఖడ్గే విరుచుకుపడ్డారు. తమ పార్టీ బలహీనంగా ఉందని మోదీ ప్రభుత్వం భావిస్తోందిగానీ ఎవరైనా దురహంకారంతో అణగతొక్కాలని చూస్తే దీటైన బదులిస్తామని కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్నారు. రాహుల్‌పై కేసులు పెట్టారు. ఆయన మాట్లాడినది ఎన్నికల సమయంలో.. ఎవరిని ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదు. కోలార్‌లో జరిగినదానికి సూరత్‌లో కేసు పెట్టారు. మీకు ధైర్యం ఉంటే కర్ణాటకలో కేసు పెట్టండి’ అంటూ బీజేపీకి ఖడ్గే సవాల్‌ విసిరారు. పార్లమెంటులో మరోమారు అదానీ వ్యవహారాన్ని లేవనెత్తుతారన్న భయంతోనే రాహుల్‌పై చర్యలకు పూనుకున్నట్లు విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌ గాంధీకి మద్దతిచ్చిన ప్రతిపక్ష పార్టీలకు వందసార్లు కృతజ్ఞతలు తెలుపుతున్నా అని ఖడ్గే అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img