Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

తొలగని అనిశ్చితి

ఆసక్తిగా మహా రాజకీయాలు
మనసు విప్పి మాట్లాడుతున్నా..
సీఎం అవుతానని అనుకోలేదు
ఇల్లు వీడితే పోరాటాన్ని వదిలినట్లు కాదు: ఠాక్రే
50 మంది మద్దతు ఉంది: షిండే

ముంబై:
మహారాష్ట్రలో శివసేన రాజకీయం ఉత్కంఠగా మారింది. ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అటు తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఇటు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఏమాత్రం తగ్గడం లేదు. 50 మంది ఎమ్మెల్యేలను తన గుప్పెట్లో పెట్టుకున్న తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే..ఏ క్షణమైనా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ సవాల్‌ విసురుతున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి పదవిని తాను ఏనాడు కోరుకోలేదని ఉద్ధవ్‌ అంటున్నారు. తన తండ్రి బాల్‌ఠాక్రే, శివసేన పేరు చెప్పుకోకుండా ఎలా జీవిస్తారని ప్రతిసవాల్‌ విసురుతున్నారు. మరోవైపు ఎన్‌సీపీ అధినేత సీఎం ఉద్ధవ్‌ను కలిసి సుతిమెత్తగా ఉంటే కుదరని, కాఠిన్యం ప్రదర్శించాలని సలహా ఇచ్చారు. శుక్రవారం ముంబై వస్తామని ప్రకటించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఇంకా అసోంలోని హోటల్‌నే బస చేశారు. మొత్తంమీద మహారాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ అదను కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని అంటున్నా శివసేన చీలికే ధ్యేయంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు.
అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య 50కి పెరిగిందన్న వార్తల మధ్య క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో భాగంగా శుక్రవారం జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. అసమ్మతి నేతలు పార్టీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందారు. వెళ్లిపోయిన వారి గురించి తానెందుకు బాధపడతానన్నారు. శివసేన, ఠాక్రే పేర్లు వాడకుండా వారెలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. తానెప్పుడూ ముఖ్యమంత్రి పదవి గురించి కలగనలేదన్నారు. ‘శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పారిపోయారు. వారు పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి గురించి నేనెందుకు బాధపడతా. శివసేన, ఠాక్రే పేరు వాడకుండా వారు ఎంతదూరం వెళ్లగలరు. షిండే తన కుమారుడిని ఎంపీని చేస్తారు. మరి.. నా బిడ్డతో ఆయనకు ఎందుకు సమస్య.
నా తల, మెడ, పాదాల వరకు మొత్తం నొప్పిగా ఉంది. కొంతమంది నేనిక కోలుకోలేననుకుంటున్నారు. కానీ నేను నా గురించి ఆలోచించుకోవడం లేదు’ అని ఠాక్రే ఉద్వేగంగా మాట్లాడారు. ‘మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టింది. దానిని ఎలాగో తట్టుకొని ముందుకు వెళ్తుంటే.. నాకు మెడనొప్పి ప్రారంభమైంది. ఈ రోజు నేను నా మనసు విప్పి మాట్లాడుతున్నాను. నేను వర్ష(అధికారిక నివాసం) వదిలి వచ్చాను. అంటే నేను పోరాటాన్ని వదిలేసినట్లు కాదు. పదవుల పట్ల వ్యామోహం కలిగిన వ్యక్తిని కాదు. నేను ముఖ్యమంత్రిని అవుతానని ఏనాడు ఊహించలేదు’ అని అన్నారు.
మా అమ్మ బాధపడిరది: ఆదిత్య ఠాక్రే
‘మిత్రపక్షాలు వెన్నుపోటు పొడిచినా ఇంతబాధగా ఉండేది కాదని మా అమ్మ బాధపడిరది. మన వల్ల ఎదిగిన మనవాళ్లు మనకు వెన్నుపోటు పొడిచారు. దానికి ఎంతగానో బాధగా ఉంది. నాన్న అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకొని వారు లాభం పొందారు’ అని అసమ్మతి నేతలపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img