Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

త్వరలో అసెంబ్లీ రద్దు?

. ముందస్తు ఎన్నికలకే అధికార పార్టీ మొగ్గు
. వారాహి, యువగళం యాత్రలను కట్టడి చేసే వ్యూహం
. ప్రతిపక్షాల పొత్తులు తేలేలోపే ప్రచారం ఉధృతం చేసే యోచన

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకే అధికార పార్టీ మొగ్గుచూపుతున్నట్లు కనపడుతోంది. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు కూడా ముందస్తును బలపరిచేలా ఉన్నాయి. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో షెడ్యూలు ప్రకారం ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్‌ వరకు అవకాశం ఉంది. అయితే తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి లబ్ధి చేకూరుతుందని ఆపార్టీ అధిష్ఠానం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితమవుతారని, తెలంగాణలో ప్రచారం చేయడానికి సమయం ఉండదని, అది తమకు ప్లస్‌ అవుతుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు. అలాగే రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగిన వారు కూడా ఏపీకి పరిమితమయ్యే అవకాశం ఉన్నందున బీఆర్‌ఎస్‌కు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌ రెడ్డి గెలుపుకు శతవిధాలా సహకారం అందించిన కేసీఆర్‌, ఈసారి కూడా అదే సహకారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వ్యూహంలో భాగంగానే ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్‌ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామగ్రామాన ఎండగడుతున్నారు. ఇప్పటివరకు రాయలసీమలో మూడు ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే పాదయాత్ర పూర్తయింది. ఇంకా 10 పాత ఉమ్మడి జిల్లాలు తిరగాల్సి ఉంది. మరోవైపు ఈనెల 14వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రభుత్వ విధానాలపై దండయాత్రకు ‘వారాహి’ వాహనంతో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల టీడీపీ, జనసేన యాత్రలను కట్టడి చేసే అవకాశం ఉంటుందని వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది. అలాగే వైసీపీ ఇప్పటికే 2024 ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుని ఉంది. తెలుగుదేశం ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందో, వారెన్ని సీట్లు డిమాండ్‌ చేస్తారో, టీడీపీ ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తుందో తేల్చుకునేలోపే వైసీపీ ప్రచారంలో ముందంజలో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం ఎన్నికల నిర్వహణ వల్ల ఆర్థిక కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజా ఆందోళనలు కూడా తీవ్రమయ్యే పరిస్థితులున్నాయని వైసీపీ అధిష్ఠానం అంచనా వేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కి 84 రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుని ముందస్తు ఎన్నికలే సరైన నిర్ణయంగా వైసీపీ ఒక అంచనాకు వచ్చింది. ఆ మేరకు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల సూచనల మేరకు పెద్దసంఖ్యలో రాష్ట్రంలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. గడప గడపకూ పేరుతో గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి చేసిన లబ్ధి గురించి వివరించే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. అంతా సిద్ధం చేసుకున్న తర్వాతే ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ముందస్తు ఎన్నికలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెల్సింది. అలాగే ఎన్నికల వరకు ఇబ్బంది లేకుండా నిధులు, అప్పులు విషయంలో ఉదారంగా ఆదుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. మొదటినుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో కేంద్ర పెద్దలు కూడా సహజంగానే అభయమిచ్చినట్లు తెల్సింది. ఫలితంగానే తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను పట్టించుకోని కేంద్రపెద్దలు, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 201415 రెవిన్యూలోటు కింద ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయంగా ఒకేసారి రూ.10,461 కోట్లు విడుదల చేశారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయిలో ఒకేసారి రూ.12,911 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ రెండు పరిణామాలు రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేశాయి. తొమ్మిదేళ్లుగా విభజన అంశాల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయని కేంద్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక కష్టాలకు అండగా నిలబడటం ప్రజల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు అప్పులు కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి చేసుకోవడానికి కేంద్రం వీలు కల్పిస్తోంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బీఎం కింద ఏపీకి 30 వేల 500 కోట్ల రూపాయలు మాత్రమే రుణ పరిమితి ఉంది. ఈ ఏడాది డిసెంబరు నెల వరకు మొత్తం 9 నెలల్లో చేయాల్సిన అప్పు రెండు నెలల్లోనే రూ.18,500 కోట్లకు చేరింది. ఇది కూడా ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, ఇలాగే పదవీ విరమణ ప్రయోజనాలు కూడా పెద్దమొత్తంలో పేరుకున్నాయి. ఇవన్నీ చెల్లించాలంటే పెద్దమొత్తంలోనే నిధులు అవసరం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సహకారం కోరిన మీదటే ఊహించని విధంగా రెవిన్యూలోటు నిధులు పెద్దమొత్తంలో కేంద్రం విడుదల చేసినట్లు చెపుతున్నారు. ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రక్రియలో భాగంగానే సోమవారం చర్చల్లో చాలా సమస్యలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఇక మిగిలిన సమస్యలపై కూడా బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తే ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు తొలగినట్లేనని భావిస్తున్నారు. అలాగే ఇటీవల టీడీపీ మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ప్రజలపై ప్రభావం చూపకుండా మరికొన్ని సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీ రద్దు అంశం బుధవారం జరిగే కేబినెట్‌లో చర్చకొచ్చే అవకాశం ఉన్నా, లేకున్నా…కీలక సమస్యల పరిష్కారం తర్వాత త్వరలోనే అసెంబ్లీ రద్దు నిర్ణయం మాత్రం తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img