Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

దండాలయ్యా…!

అన్నీ విజ్ఞాపనలే

కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి హామీల్లేవ్‌
ఒట్టి చేతులతో సీఎం జగన్‌ తిరుగుముఖం
ముగిసిన రెండు రోజుల దిల్లీ పర్యటన
ప్రస్తావనేలేని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటన ఆసాంతం విజ్ఞాపనపత్రాల సమర్పణతోనే ముగిసింది. రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క సమస్యపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. తొలిరోజు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, విమానయానశాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసి రాష్ట్ర సమస్యలు వివరించారు. ప్రధాని నివాసంలో మోదీతో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. ఈసందర్భంగా గతంలో దిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధాని దృష్టికి తీసుకొచ్చే సమస్యలనే మరోసారి వినతిపత్రం ద్వారా నివేదించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను క్లుప్తంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇక వాటిలో కొత్త అంశం అప్పులపై ఆంక్షల సడలింపు ఒక్కటే. ప్రత్యేక హోదాతో పాటు పెండిరగ్‌లో ఉన్న విభజన అంశాలు అమలు, పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు వంటి ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారు. ఆతర్వాత ఇవే అంశాలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులను వేర్వేరుగా కలిసి సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. తొలిరోజు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, పౌర విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసి రెవెన్యూలోటు, పోలవరం పెండిరగ్‌ నిధులు, తెలంగాణ నుంచి రావల్సిన విద్యుత్‌ బకాయిలు, రుణ పరిమితి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి నిధులకు సంబంధించి సహకారం కోరారు. మంగళవారం కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ, సమాచార ప్రసారాలు, క్రీడాశాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌లతో వరుస గా భేటీ అయ్యారు. గడ్కరీతో సుమారు గంటపాటు గడిపారు. రాష్ట్రంలో ఇటీవల కొన్ని జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు తొలుత సీఎం జగన్‌ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్‌ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని, సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌కారిడర్‌ ప్రాజెక్టులకు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత ఉపయోగకరమని కేంద్రమంత్రికి వివరించారు. అలాగే విశాఖ నగరంలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని మంజూరు చేయాలని, కత్తిపూడిఒంగోలు కారిడర్‌లో భాగంగా ఎన్‌హెచ్‌`216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని సీఎం జగన్‌ కోరారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఇలా మొత్తానికి రెండు రోజుల సీఎం జగన్‌ దిల్లీ పర్యటన.. ప్రధానితో పాటు, ఐదుగురు మంత్రులతో వరుస భేటీలు జరిగినప్పటికీ ఎక్కడా ఏపీకి అత్యంత కీలకమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలన్న అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
కాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న ఏ ఒక్క సమస్యపైనా కేంద్ర మంత్రుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం రాష్ట్ర ప్రజలను మరోసారి నిరాశపర్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img