Monday, March 20, 2023
Monday, March 20, 2023

దద్దరిల్లిన కలెక్టరేట్లు

జగనన్న ఇళ్లకు రూ.5 లక్షలిచ్చేవరకు పోరు

. ఉగాదికి టిడ్కో గృహప్రవేశాలు
. విజయవాడలో 22న మహా ధర్నా
. లబ్ధిదారులు భారీగా తరలిరావాలని రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళష్ట్రa లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. మాకు సెంటు భూమి, మీకు ఎకరాల్లో ప్యాలెస్‌లా అంటూ సీఎంను నిలదీశారు. రోడ్డు, నీరు, విద్యుత్‌ వంటి కనీస సదుపాయాల్లేకుండా జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం ఊకదంపుడు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. లక్షా 80 వేలతో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిరుపతి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహా ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కార్యదర్శివర్గసభ్యులు పి.హరినాథరెడ్డి పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్లు ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి… వాటి నిర్మాణ దశను కళ్లు తెరిచి చూడాలని హితవు పలికారు. ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్షల రూపాయలు కనీసం పునాదులకు కూడా సరిపోవన్నారు. ట్రాక్టర్‌ ఇసుక రూ.8 వేలు, లారీ ఇసుక 40 వేల రూపాయలు అమ్ముతున్నారని, స్థలం వచ్చిందన్న ఆశతో ఇళ్లను నిర్మించుకోలేక పేదలు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు సెంటు స్థలం కేటాయించిన జగన్‌ తాను మాత్రం పులివెందుల మొదలు విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, ఇప్పుడు విశాఖలో ఎకరాల స్థలంలో విలాసవంతమైన ఇళ్లు నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు. జగనన్న ఇళ్లకు మూడు సెంట్ల స్థలం, నిర్మాణ ఖర్చుల కింద ఐదు లక్షలు డిమాండ్‌ చేస్తుంటే కమ్యూనిస్టు నాయకుల మీద ప్రభుత్వం నిర్బంధాలు విధించి కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫిబ్రవరి 22వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులు అందర్నీ ఏకం చేసి మార్చి 22 ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయిస్తామని స్పష్టం చేశారు. హరినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ కోట్లాది రూపాయలు ప్రచారానికి ఖర్చు చేసి జగనన్న ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చానని గొప్పలు పలకడం తప్ప వాటి నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడడంతో డిప్యూటీ కలెక్టర్‌ భాస్కర్‌ నాయుడును ధర్నా శిబిరం వద్దకు పంపారు. పేదల వద్ద నుండి, లబ్ధిదారుల నుండి వచ్చిన వందలాది అర్జీలను రామకృష్ణ ద్వారా స్వీకరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గసభ్యులు ప్రభాకర్‌, చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇనుము, ఇసుక, సిమెంట్‌ ఉచితంగా ఇవ్వాలి: ముప్పాళ్ల
జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించి, ఇంటి నిర్మాణానికి ఇనుము, ఇసుక, సిమెంటు ఉచితంగా ఇవ్వడంతోపాటు రూ.5 లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నరసరావుపేట గాంధీ పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం లబ్ధిదారులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందచేశారు. కలెక్టర్‌ కార్యాలయం గేటు బయట పోలీసులు సీపీఐ నాయకులను అడ్డగించడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీ శ్రేణులు కలెక్టర్‌ కార్యాలయం గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందచేయాలని, లేకుంటే లబ్ధిదారులతో కలిసి ఈ నెల 22వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్‌ హుస్సేన్‌, కాసా రాంబాబు, నాయకులు బూదాల శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, నాగభైరవ సుబ్బాయమ్మ, చెరుకుపల్లి నిర్మల, వైదన వెంకట్‌, ఉప్పలపాటి రంగయ్య, షేక్‌ సుభాని, మహంకాళి సుబ్బారావు, తాళ్లూరి బాబురావు, దాసరి వరహాలు తదితరులు పాల్గొన్నారు.
ఎడారులను తలపిస్తున్న జగనన్న కాలనీలు: జేవీఎస్‌ మూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి విమర్శించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ కాలనీలు ఏర్పాటు చేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, ఇళ్ల నిర్మాణాలకు సరిపడినంత నిధులు కేటాయించకపోవడంతో కాలనీలు ఎడారులను తలపిస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న ధరలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తామని, లబ్ధిదారులు రూ.35 వేలు చెల్లిస్తే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామనడం పేద వర్గాలపై భారం మోపడమేనన్నారు. 90 శాతం పనులు పూర్తయిన టీడ్కో ఇళ్లను అప్పగించడంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతోందని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, కార్యవర్గ సభ్యులు ఎస్‌కే రెహమాన్‌, కసిరెడ్డి సత్యనారాయణ, పి.చంద్రశేఖర్‌, క్షేత్రపాల్‌, ఆర్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పేదలను అప్పులపాలు చేయొద్దు: జల్లి విల్సన్‌
పేదలు అప్పుల పాలవకుండా ఉండాలంటే ఇంటి నిర్మాణదారులకు రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాపట్ల కలెక్టరేట్‌ రోడ్డులోని చీలురోడ్డు సెంటర్లో సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో జగనన్న లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. జల్లి విల్సన్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ ఎన్నికల ముందు పాదయాత్రలో అర్హులందరీకి ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కల నెరవేస్తానని హామీ ఇచ్చారని, అది నెరవేరాలంటే ఇంటికి రూ.5లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జేబీ శ్రీధర్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్‌, సీపీఐ నాయకులు దుండి కనకారెడ్డి, తుమ్మల పూర్ణచంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల్లేకుండా ఇంటి నిర్మాణమెలా: వనజ
కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, నిర్మాణానికి సరిపడా నిధులు ఇవ్వకుండా ఇంటి నిర్మాణాలు ఎలా సాధ్యమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రశ్నించారు. భీమవరం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌కు అందజేశారు. ధర్నా నుద్దేశించి వనజ మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు నివాసయోగ్యంగా లేవన్నారు. పెరుగుతున్న ధరల కనుగుణంగా ఒక్కో గృహ నిర్మాణానికి కనీసం రూ.5 లక్షలు కేటాయించాలని వనజ డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాం ప్రసాద్‌, యస్‌. పుష్పకుమారి, కళింగ లక్ష్మణరావు, టి.అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
అవినీతిని అరికట్టాలి: ఈశ్వరయ్య
జగనన్న కాలనీలలో అవినీతిని అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య డిమాండ్‌ అన్నారు. రాయచోటి కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కారు చౌకుగా అధికార పార్టీ నాయకులు బినామీ పేర్లతో కొనుగోలు చేసి కాలనీ ఇళ్ల నిర్మాణం కోసం అధిక ధరలకు అమ్ముకొంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా మూడు లక్షల రూపాయల తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంటే జగన్‌ ప్రభుత్వం అతి తక్కువ డబ్బులు ఇచ్చి త్వరగా ఇళ్లు పూర్తి చేయాలని లబ్ధిదారులను బెదిరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా టిడ్కో గృహాలు పూర్తిగా లబ్ధిదారులకు స్వాధీనం చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నర్సింహులు, సహాయ కార్యదర్శి మహేశ్‌, రాష్ట్ర సమితి సభ్యులు కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
టిడ్కో ఇళ్లను తక్షణమే స్వాధీనం చేయాలి: జంగాల
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకి వెంటనే స్వాధీనం చేయాలని, జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ గుంటూరు జిల్లా సమితి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. సీపీన నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్ని తిరుపతయ్య, పుప్పాల సత్యనారాయణ, ముప్పాళ్ల శివ శంకరరావు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరేటి రామారావు, షేక్‌ వలి, బందెల నాసర్‌ జీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఐదు లక్షలిచ్చేవరకు పోరు ఆగదు: డేగా ప్రభాకర్‌
జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయించే వరకు పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు ఎండి మునీర్‌, సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, కారం దారయ్య, బాడిస రాము, సన్నేపల్లి సాయిబాబా, బత్తుల వెంకటేశ్వరరావు, జమ్మి శ్రీనివాసరావు, కొండేటి బేబి పాల్గొన్నారు.
22న విజయవాడ ధర్నాకు రండి: రామచంద్రయ్య
జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలకు రూ.5 లక్షలు మంజూరు చేయాలని, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 22వ తేదీ విజయవాడలో జరగనున్న మహాధర్నాకు లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలిరావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పి.రామచంద్రయ్య పిలుపునిచ్చారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట పి.రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య తదితరులు పాల్గొనగా, నంద్యాల కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు పాల్గొన్నారు.
కోర్టులో దోషిగా నిలబెడతాం: జగదీశ్‌
జగనన్న ఇళ్ల లబ్ధిదారులకిచ్చిన పట్టాలు, పథకాలు ఏ ఒక్కటి రద్దు చేసినా సీఎం జగన్‌ని హైకోర్టులో దోషిగా నిలబెడతామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్‌ హెచ్చరించారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో జిల్లా కార్యదర్శి జాఫర్‌, జిల్లా సహాయ కార్యద ర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, జిల్లా నాయకులు రామకృష్ణ, కేశవ రెడ్డి, నారాయణస్వామి, రమణ, పద్మావతి, రాజేశ్‌ గౌడ్‌, సంతోశ్‌ కుమార్‌, నాగరాజు కుల్లాయ్‌స్వామి, ఆనంద్‌ కుమార్‌, అల్లిపిరా పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో: ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పెన్మెత్స దుర్గాభవాని, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఎం.వెంకటసుబ్బయ్య, విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు, డీహెచ్‌పీఎస్‌ ఉపాధ్యక్షులు బుట్టి రాయప్ప తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్రకార్యవర్గసభ్యులు దోనేపూడి శంకర్‌ పాల్గొన్నారు.
కృష్ణాజిల్లాలో: మచిలీపట్నం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.శివారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి తాటిపర్తి తాతయ్య, జిల్లా నాయకులు లింగం ఫిలిప్‌, ఒంటిపులి లక్ష్మణరావు, ఓడుగు రత్నకుమారి పాల్గొని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
నెల్లూరులో: నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి దామా వెంకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్‌, జిల్లా కార్యదర్శి నందిపోగుల రమణయ్య, మున్నా, విజయకుమార్‌ పాల్గొన్నారు.
కడపలో: కడప ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు కలెక్టరేట్‌ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నగర కార్యదర్శి వెంకట శివ పాల్గొన్నారు.
పార్వతీపురంలో: పార్వతీపురం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పి.కామేశ్వరరావు, మన్యం జిల్లా సీపీఐ కార్యదర్శి కోరంగి మన్మథరావు, సహాయ కార్యదర్శి జీవన్‌ పాల్గొన్నారు.
చిత్తూరులో: జగనన్న ఇళ్లకు 5 లక్షలివ్వాలని డిమాండ్‌ చేస్తూ చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్రకార్యవర్గసభ్యులు ఎ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజన్‌, సహాయ కార్యదర్శి టి.జనార్థన్‌, ఎస్‌.గుర్రప్ప, రమాదేవి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో: కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత అశోక్‌, ఎ.ఆనందరావు, మద్దతుగా సీపీఎం, టీడీపీ, ఆమ్‌ఆద్మీపార్టీ,లోక్‌సత్తా, జనసేన నాయకులు రెడ్డి శంకరరావు, ఐవీపీ రాజు, క.దయానంద్‌, రాజారావు, రామకృష్ణ పాల్గొన్నారు
ఒంగోలులో: ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, కార్యదర్శివర్గసభ్యులు ఆర్‌.వెంకట్రావు, డీహెచ్‌పీఎస్‌ ప్రధానకార్యదర్శి కరవది సుబ్బారావు, ఒంగోలు నగర కార్యదర్శి పీవీఆర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో: జగనన్న కాలనీలకు ఇనుము, ఇటుక, ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామమూర్తి, ఏఐవైఎఫ్‌ ప్రధానకార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, చాపర సుందరలాల్‌, లండ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తిలో: పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహిం చారు. సీపీఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, జిల్లా నాయకులు బయన్న, కాటమయ్య, జింక చలపతి, హనుమంతరెడ్డి, ఆంజనేయులు, రాజా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img