Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

దద్దరిల్లిన పార్లమెంట్‌

. రాహుల్‌ క్షమాపణకు బీజేపీ డిమాండ్‌
. ప్రధాని వ్యాఖ్యలకు విపక్షాల కౌంటర్‌
. పోటాపోటీ నినాదాలు బ సాగని కార్యకలాపాలు
. ఉభయ సభలలో వాయిదాల పర్వం

న్యూదిల్లీ: అదానీ వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ కోసం పార్లమెంటులో విపక్షాలు ఐక్యంగా డిమాండ్‌ చేశాయి. కానీ కేంద్రప్రభుత్వం వారి గొంతు నొక్కేస్తూ ఆ వ్యవహారంలో ఈ డిమాండ్‌ చేయనివ్వలేదు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బ్రిటన్‌లో మాట్లాడుతూ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాల్జేశారంటూ అధికారపక్ష సభ్యులు విరుచుపడ్డారు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ అంశం పార్లమెంటును కుదిపివేసింది. రెండవ రోజైన మంగళవారం లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు బుధవారానికి ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
లోక్‌సభ ఉదయం సమావేశమైనప్పుడు రాహుల్‌ గాంధీ దేశానికి, చట్టసభలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రధాని మోదీ విదేశాల్లో చేసిన ప్రసంగాల్లోని వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘రాహుల్‌ మాఫీ మాంగో’ (రాహుల్‌ క్షమాపణ చెప్పు)’ అని బీజేపీ సభ్యులు తమ స్థానాల్లో నిలుచొని బిగ్గరగా అరిచారు. విపక్ష సభ్యులు కౌంటర్‌ నినాదాలు చేశారు. ఎవరూ వెల్‌లోకి వెళ్లలేదు. ‘బ్రిక్స్‌ కా ఐ లుడక్‌ రహా హై’ (బ్రిక్స్‌లోని ఐ దొర్లిపోతోంది’ అని బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా సంఘాన్ని ఉద్దేశించి ఓ ప్లకార్డును కాంగ్రెస్‌ నేతలు ప్రదర్శించారు. ‘గతజన్మలో ఏ పాపం చేశాడో. భారతదేశంలో పుట్టాడు’ అని మరొక ప్లకార్డును ఒకరు ప్రదర్శించారు. 2015, మేలో సియోల్‌లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నోత్తరాలను నిర్వహించేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా యత్నించారు. సభ్యుల సహకారాన్ని కోరారు కానీ అది సాధ్యం కాలేదు. సభ ఔన్నత్యాన్ని కాపాడాలని కాంగ్రెస్‌ సభ్యులకు సూచించారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దన్నారు. ‘ప్రశ్నత్తరాలను జరగనివ్వండి. మీ ప్రశ్నలు అడిగేందుకు అవకాశమిస్తా. పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రశ్నోత్తరాలు కీలకం. అందరికి సముచిత అవకాశాలిస్తానుగానీ ప్రశ్నోత్తరాల తర్వాత… మీ స్థానాల్లో కూర్చోండి’ అని బిర్లా అన్నారు. కానీ అధికారప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడిరది. తిరిగి సమావేశమపైనప్పుడు సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొంది. అయినప్పటికీ పత్రాలు, స్థాయి సంఘాల నివేదికలను సమర్పించారు. కానీ పది నిమిషాల్లోనే సభ బుధవారానికి వాయిదా పడిరది. అటు రాజ్యసభలోనూ రెండవ రోజు వాయిదాలు సరిపోయాయి. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో సభ రసాభాస అయింది. మొదటి వాయిదా తర్వాత సభ మధ్యాహ్నం 2గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. దీనిపై చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ స్పందిస్తూ ‘పరిస్థితిని సమీక్షించాం. రాజ్యాంగ నిబంధనలు, మేము రూపొందించిన నియమాలు, చేసిన సూచనలు గత చైర్మన్‌లు విశదీకరించినవే’ అని అన్నారు. ఫ్లోర్‌ లీడర్లతో తన భేటీని ప్రస్తావించారు. సభ్యులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పార్లమెంటును అపఖ్యాతి తెస్తూ, పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నిస్తే అది కచ్చితంగా దేశానికి క్షమాపణ చెప్పాల్సిన వ్యవహారమని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ అన్నారు. ఇదే విషయంలో అధికారవిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ రసాభాస అయింది. దీంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ తెలిపారు.
ఇదిలావుంటే ఉభయ సభల్లో అనేక పెండిరగ్‌ బిల్లులు ఉన్నాయి. లోక్‌సభలో తొమ్మిది, రాజ్యసభలో 26 బిల్లులను ఆమోదించాల్సి ఉంది. ఇవి కాకుండా బహుళరాష్ట్ర సహకార సంఘాలు (సవరణ) బిల్లు, 2022, ది జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణలు) బిల్లు, 2022ను పార్లమెంటు శీతాకాల సమావేశాలప్పుడు సంయుక్త కమిటీకి సిఫార్సు చేశారు. వీటిపైనా చట్టసభల్లో చర్చ జరగాల్సి ఉంది. కాగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నెల తర్వాత పార్లమెంటు సమావేశమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img