Sunday, November 27, 2022
Sunday, November 27, 2022

దారుణం

అప్పులిచ్చి మింగేస్తున్న లోన్‌ యాప్‌లు!

తెలుగు రాష్ట్రాల్లో ఆగడాలు
నిత్యం చిత్ర హింసలు
బ పరువు ప్రతిష్ఠలకు భంగం
ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు
చెన్నయ్‌ కేంద్రంగా దందా

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రుణాల పేరిట ప్రజలకు ఎర వేసి దారుణాలకు ఒడిగడుతున్నారు. ‘మీరు రుణం వడ్డీతో సహా తీర్చండి… లేకుంటే మీ పిల్లల్ని చంపుతాం…మీ బంధువులకు మీ ఫోటోలు పంపి వేధింపులకు పాల్పడతాం… అంటూ రికవరీ ఏజెంట్లు బరి తెగించి బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చాలా మంది ఈ యాప్‌ల బారిన పడి ఆర్థికంగా చితికిపోగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రుణం తీరకముందే బెదిరింపులు రావడంతో బాధితులకు దిక్కుతోచడం లేదు. మొదట తీయగా రుణ ఆసక్తిదారులను ఫోన్ల ద్వారా మాటల్లోకి లాగి, ఆ తర్వాత లోన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయిస్తుంటారు. సునాయాసంగా, ఎలాంటి కాగితాలు, హామీలు లేకుండా, బ్యాంక్‌ క్రెడిట్‌ స్కోర్‌ అవసరం లేకుండా, తక్కువ వడ్డీతో క్షణంలో రుణం మంజూరవుతుందంటూ నమ్మిస్తారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు వారి మాయమాటలకు పడి, తుదకు అసలు కంటే, వడ్డీ తీర్చలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. లోన్‌యాప్‌లను పేద, మధ్యతరగతి వర్గాలు

ఆన్‌లైన్‌ ద్వారా ఆశ్రయించి, చిన్న మొత్తంలో రుణాలు తీసుకుంటున్నారు. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో వారి పూర్తి సమాచారంతోపాటు బంధువుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్లో పొందుపరుస్తారు. ఆ తర్వాత రుణం చెల్లించకుంటే, అందులో సమాచారమున్న వారందరి ఫోన్లకు బెదిరింపులు వెళ్తాయి. ఆ రుణం మీరే చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తారు.
అసలుకు నాలుగు రెట్లు వసూలు
లోన్‌ యాప్‌లో బాధితుడు తీసుకున్న అసలు కంటే, నాలుగు రెట్లు వేసి వసూలు చేస్తున్నారు. అది కట్టే స్థోమత లేక, రుణ గ్రస్తులు నిత్యం వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తీసుకున్న రుణం కోసం నిర్వాహకుల నుంచి బెదిరింపు ఫోన్లు రావడం చర్చానీయాంశంగా మారింది. రుణం పొందే సమయంలో మంత్రి నంబరు కూడా ఇచ్చారు. దీంతో ఏకంగా ఆయన నంబరుకు 72సార్లు ఫోన్లు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు వ్యక్తిగత సహాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి, లోన్‌ యాప్‌ల మూలాలను గుర్తించారు. చెన్నయ్‌ కేంద్రం నుంచి ఆన్‌లైన్లో లోన్‌యాప్‌ బృందం ఆగడాల సాగిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన ఏజెంట్లతోపాటు చెన్నయ్‌లోని మేనేజరును అదుపులోకి తీసుకున్నారు. ఇదే తరహా హైదరాబాద్‌, బెంగుళూరు, ముంబై తదితర మహానగరాల నుంచి లోన్‌యాప్‌ల కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ కంపెనీల ఆగడాలు
ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్స్‌ నుంచి గతంలో గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన ప్రత్యూష అనే యువతి రూ.20వేల రుణం తీసుకుంటే, ఆమె ద్వారా రూ.2 లక్షలు రీపేమెంట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత రుణం ఉందంటూ వాట్షాఫ్‌కు అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపుతున్నారు. దీంతో మనస్తాపంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిరది. ఆత్మహత్యకు పాల్పడే ముందు తమ తల్లిదండ్రులు, భర్తకు సెల్ఫీ వీడియో పంపింది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ జియాగూడలో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోన్‌యాప్‌ ద్వారా రూ.12వేల అప్పు తీసుకుని, ఆ సమయంలో తన మిత్రుల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్లో నమోదు చేశారు. ఇంకా రూ.4వేలు చెల్లించలేదంటూ రాజ్‌కుమార్‌ మిత్రులకు లోన్‌ యాప్‌ ఏజెంట్లు ఒత్తిడి చేయడంతో, తీవ్ర మనస్తాపానికి రాజ్‌కుమార్‌ గురై, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఎంతో మంది లోన్‌యాప్‌ బారిన పడి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బాధితుల ఫోటోలు మార్ఫింగ్‌ చేసి, వాటిని అసభ్యకరమైన చిత్రాలతో జోడిరచి సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. లోన్‌యాప్‌ నిర్వాహకుల ఆగడాలు మితిమీరుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నియంత్రించడం లేదు. ప్రత్యేక సైబర్‌ బృందాలను ఏర్పాటు చేసి, లోన్‌యాప్‌ల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
లోన్‌ యాప్‌లపై ప్రత్యేక నిఘా: డీజీపీ
లోన్‌యాప్‌లపై ప్రత్యేక నిఘా ఉంచామని, నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ చెప్పారు.యాప్‌ల ద్వారా లోన్‌ తీసుకుని, తిరిగి కట్టలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరమన్నారు. చాలా ఫోన్‌ కాల్స్‌ ప్రైవేట్‌ నెంబర్ల నుంచి వస్తున్నాయని, సైబర్‌ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఆధార్‌ డేటా, ఫింగర్‌ ప్రింట్లు ఎవరికి ఇవ్వవద్దని సూచించారు. లోన్‌యాప్‌ల డేటాను సేకరిస్తున్నామని, లోన్‌ వసూళ్లలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img