న్యూదిల్లీ : దేశ రాజధాని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని, దీనిని అధిగమించడానికి తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం చెప్పారు. నగరానికి విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు చాలినంత బొగ్గు, గ్యాస్ అందజేయాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. ‘దిల్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నది. పరిస్థితిని నేను స్వయంగా పరిశీలిస్తున్నాను. సంక్షోభ నివారణకు శక్తివంచన లేకుండా మేము ప్రయత్నిస్తున్నాం. దీనితో ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశాను’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆగస్టు నుంచి నగరం బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నదని లేఖలో స్పష్టంచేశానని పేర్కొన్నారు. బొగ్గు, గ్యాస్ కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పానన్నారు.