Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

దిల్లీ మేయర్‌ పీఠం ఆప్‌దే

మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌, డిప్యూటీగా ఇక్బాల్‌

న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీ మేయర్‌ పీఠం ఎట్టకేలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) దక్కించుకుంది. మేయర్‌ పీఠం కోసం ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం జరిగింది. చివరికి ఆప్‌ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్‌ కాగా షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు, రేఖా గుప్తాకు 116 ఓట్లు లభించాయి.కాగా డిప్యూటీ మేయర్‌ పదవి కూడా ఆప్‌నే వరించింది. ఆప్‌ అభ్యర్థి ఆలే మహ్మద్‌ ఇక్బాల్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కమల్‌ బగ్రీపై ఇక్బాల్‌ 31 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్బాల్‌కు మొత్తం 147 ఓట్లు రాగా బగ్రీకి 116 లభించాయి. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆప్‌ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్‌కు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అభినందనలు తెలిపారు. ‘ప్రజలు గెలిచారు. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించిన కార్యకర్తలు, ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆప్‌ తొలి మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌కు హృదయపూర్వక అభినందనలు’ అని ఇద్దరూ ట్వీట్‌ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నరు నామినేట్‌ చేసిన సభ్యులను ఓటింగ్‌కు దూరంగా ఉంచారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలో ఆప్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీ మార్క్‌(126)ను దాటి.. ఏకంగా 134 స్థానాలు కైవసం చేసుకుంది. మెజారిటీ ప్రకారం మేయర్‌ పదవి ఆప్‌కు దక్కాల్సి ఉంది. అయితే, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్‌ కౌన్సిలర్లతో ప్రిసైడిరగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి దారితీసింది. దీన్ని ఆప్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే ఆప్‌, బీజేపీ మధ్య వాగ్వాదం జరిగి ఈ ఎన్నిక ప్రక్రియ మూడుసార్లు వాయిదా పడిరది. ఎన్నికను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ ఆప్‌ మేయర్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. మేయర్‌ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేయరాదని తేల్చి చెప్పింది. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశానికి 24 గంటల్లో నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం నిర్వహించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతించారు. తొలి సమావేశంలోనే మేయర్‌ ఎన్నిక నిర్వహించగా ఆప్‌ విజయం సాధించడంతో 15 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ నుంచి మేయర్‌ పీఠం చేజారినట్టయింది. మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్‌ కాలేజీ ప్రొఫెసర్‌. దిల్లీ యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గానూ పనిచేస్తున్నారు. ఆమె వయస్సు 39 ఏళ్లు. ఇండియన్‌ కామర్స్‌ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యురాలు. హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె.. ఇగ్నో నుంచి స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో పటేల్‌ నగర్‌ (తూర్పు) వార్డు నుంచి తొలిసారి కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆమెను ఆప్‌ మేయర్‌ అభ్యర్థిగా బరిలో దించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img