సీపీఐ పశ్చిమబెంగాల్ సమితి సమావేశంలో డి.రాజా, నారాయణ
కోల్‌కతా: న్యాయవ్యవస్థపై బీజేపీ ప్రభుత్వానికి విశ్వాసం లేదని, ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎంపీని పోలీసుల సమక్షంలోనే, జైశ్రీరామ్ అనుచరులుగా చెపుతున్న కొంతమంది దుండగులు హత్యచేయడమే ఇందుకు నిదర్శనమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. యూపీలో ఆటవిక, అరాచక పాలన నడుస్తున్నా…కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు చూస్తువుందేతప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సీపీఐ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం మూడు రోజులపాటు జరిగింది. ఆదివారం ముగిసిన ఈ సమావేశాల్లో డి.రాజా, సీపీఐ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, పల్లవ్‌సేన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, సాంకేతిక కారణాలు చూపుతూ సీపీఐ జాతీయహోదాను ఎన్నికల సంఘం తొలగించడం విచారకరమని వ్యాఖ్యానించారు. 26 రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు, హోల్‌టైమర్లు, అంకితభావంతో క్రియాశీలంగా పనిచేస్తున్న కార్యకర్తలు కలిగివున్న పార్టీ హోదాను ఎన్నికల సంఘం తొలగించడం అసహేతుకమైన నిర్ణయమని అన్నారు. కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల్లో ఓట్లను బట్టి గుర్తింపు ఇవ్వడమనేది సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ కేవలం మెజారిటీవాదానికి ప్రాతినిధ్యం వహించడం లేదని గుర్తించాలన్నారు. ఓట్లు, సీట్లు వచ్చిన పార్టీలకే ఈసీ ప్రాతినిధ్యం వహిస్తుందా అని రాజా ప్రశ్నించారు. తక్షణమే దామాషా ప్రాతినిధ్య వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో అరాచక పాలన నెలకొన్నద న్నారు. అందుకు యూపీలో శనివారం పోలీసుల సమక్షంలో జరిగిన హత్యలే ఉదాహరణ అని తెలిపారు. పుల్వామాలో సైన్యంపై టెర్రరిస్టుల దాడులకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. దేశభద్రతకే ముప్పు వాటిల్లిందని, రాజ్యాంగ వ్యవస్థ బలహీనపడిరదన్నారు. మోదీ పాలనకు చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా అమ్మకానికి పెట్టిందని దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీ, ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చేసి, ప్రతిపక్ష పార్టీలను వేధించడానికే వాటిని వాడుకుంటున్నదని విమర్శించారు. మోదీని తక్షణమే గద్దె దించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం దేశవ్యాప్తంగా చేపట్టిన నెల రోజుల ప్రచారభేరీ ద్వారా మోదీ మోసాలను ప్రజలకు తెలియపరుస్తున్నట్లు తెలిపారు.