Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

దేశ అభివృద్ధిలో శ్రామికశక్తి కీలకం

. ప్రధాని నరేంద్ర మోదీ
. తిరుపతిలో జాతీయ కార్మిక సదస్సు ప్రారంభం

విశాలాంధ్ర`తిరుపతి: భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించాలన్న కలలు, ఆకాంక్షలను సాకారం చేయడంలో శ్రామికశక్తిదే కీిలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తిరుపతిలో గురువారం జరిగిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మికశాఖ మంత్రుల ‘జాతీయ కార్మిక సదస్సు’ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ప్రసంగించారు. తొలుత సదస్సును కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌.ఎన్‌.భూపేంద్ర యాదవ్‌ ప్రారంభించారు. వర్చువల్‌ ద్వారా ప్రధాని ప్రసంగిస్తూ, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణంలో అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలనే భారతదేశం కలలు, ఆకాంక్షలను సాకారం చేయడంలో దేశ శ్రామిక శక్తికి కీలక పాత్ర ఉందన్నారు. భారత్‌ను మరోసారి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలబెట్టిన ఘనత కార్మికులకే దక్కుతుందన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం బానిసత్వ మనస్తత్వం కలిగిన అనేక కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు చొరవ తీసుకుందని చెప్పారు. కార్మికుల భవిష్యత్తు అవసరాలను, భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ విజన్‌ 2047ను సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం భూపేందర్‌ మాట్లాడుతూ, ముఖ్యమైన కార్మిక సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం సదస్సును ఏర్పాటు చేసిందని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన విధానాలను రూపొందించి, కార్మిక పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయాన్ని తీసుకురావాలన్నది ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img