Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

ధాన్యం అమ్ముకోలేని దుస్థితి

. ప్రతి గింజా కొంటామన్న ప్రభుత్వం
. ఆర్బీకేల చుట్టూ అన్నదాతల ప్రదక్షణలు
. మన్యం జిల్లా రైతుల గోడు వినని అధికారులు
. ఏనుగుల వల్ల పంట నష్టపోతున్న వైనం
. తక్షణమే ధాన్యం కొనుగోలుకు రైతుల డిమాండ్‌

విశాలాంధ్ర`పార్వతీపురం: రాష్ట్రంలో అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైన ప్రాంతంగా శ్రీకాకుళం, ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలనే చెప్పవచ్చు. ఇక్కడి ప్రజలు కష్టపడి జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చిన్నచిన్న కమతాలు సాగు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తారు. భూములు లేనివారు, ఉన్నవారు కూడా ఉపాధి హామీ పథకం పనులకు వెళతారు. అయితే నేడు వారు ఆరుగాలం పండిరచిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి పడేకష్టాలు వర్ణనాతీతం. సాధారణంగా రైతులు ఎక్కువ మంది సంక్రాంతి పండుగ తర్వాత వరి చేళ్లను నూర్చి వారి తిండికి కొంత ఉంచుకొని, మిగిలిన ధాన్యాన్ని అమ్మడం ఆనవాయితీ. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. జిల్లా అధికారులు ప్రభుత్వ లక్ష్యం మేరకు డిసెంబరు లోపే లక్షా 92 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేశారు. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు త్వరితగతిన ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ నేడు చిన్న, సన్నకారు రైతుల వద్దనే ఎక్కువ ధాన్యం ఉండటంతో వారంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని పెద్దఎత్తున ప్రచారం చేసింది. కానీ సచివాలయంలో పని చేసే వ్యవసాయ సహాయకుల సహాయ సహకారాలతో ఎక్కువ మంది దళారులు రంగ ప్రవేశం చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ చేశారన్నది జగమెరిగిన సత్యం. అయితే ఆర్బీకేల చుట్టూ తిరగలేక, పనులు మానుకోలేక గ్రామాల్లో ఉండే దళారులను ఆశ్రయించి బస్తాకు 50 నుంచి 100 రూపాయల నష్టానికి ధాన్యం ఇస్తున్నామని అనేక మంది రైతులు తెలిపారు. ఈ ఏడాది జిల్లా అధికారులు మిల్లర్ల ప్రమేయాన్ని నివారించడంలో శత శాతం విజయం సాధించిన ప్పటికీ, రైతులను మోసం చేస్తున్న ఈ తరహా వ్యాపారులను కట్టడి చేయకపోవడం వల్లే నేడు అన్ని గ్రామాల్లో రైతుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. పాలకొండ, సీతానగరం, బలిజిపేట, వీరఘట్టం వంటి మండలాల్లో ఇంకా లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం బస్తాలు ఉన్నాయని రైతులు స్పష్టం చేస్తున్నారు. గత సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి రైతులు పెద్దఎత్తున వెళ్లి ధాన్యం కొనుగోలు చేసి న్యాయం చేయాలని వినతులు అందజేశారు. గత పదేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ధాన్యం దిగుబడి వచ్చిందని, ఎక్కడా ధాన్యం ముక్కలు కాలేదని, అధికారుల చుటూ కాళ్లరిగేలా తిరగడమేమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం లక్ష్యాలను గతంతో పోల్చి తక్కువ లక్ష్యాన్ని ప్రభుత్వానికి నివేదిక అందజేయడం వల్లనే సంక్రాంతి పండుగ తర్వాత కొనుగోళ్ల పరిస్థితి తలెత్తింది. రైతులకు ఆందోళన కలిగించే మరో సమస్య ఏమిటంటే, గత ఆరేళ్లుగా కొమరాడ, కురుపాం, జియ్య మ్మవలస, సీతమ్మపేట, భామిని మండలాల్లో ఏనుగుల గుంపు వల్ల పంట ఉత్పత్తులకు జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. చాలా మంది రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అధికారులు మాత్రం చెల్లింపులు చేయ డం లేదు. అధికారులు ఏనుగుల తరలింపుపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, తగు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రధాన సమస్యలైన ఈ రెండిరటిపై అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు దృష్టి పెట్టాలని మన్యం జిల్లాలోని 15 మండలాల ప్రజలు కోరుతున్నారు.
కొనుగోలు సత్వరమే చేయాలి: రైతు సంఘం నేతల డిమాండ్‌
జిల్లాలోని ప్రస్తుతం చిన్న, సన్న కారు రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వల మొత్తాన్ని కొనుగోలు చేయాలని రైతు సంఘం నేతలు బుడితి అప్పల నాయుడు, రెడ్డి లక్షుము నాయుడు డిమాండ్‌ చేశారు. జిల్లాలో సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నందున సత్వరమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతుల ఆందోళన, ఆవేదనను గమనించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏనుగుల గుంపులను తరలించాలి: సీపీఐ డిమాండ్‌
జిల్లాలోని ఇటు కొమరాడ, అటు భామిని మండలంలో ఉంటున్న రెండు ఏనుగుల గుంపులను తరలించే ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే చేపట్టాలని మన్యం జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి కోరంగి మన్మధరావు, సహాయ కార్యదర్శి జీవన్‌ డిమాండ్‌ చేశారు. గత ఆరేళ్లుగా ఇక్కడ రైతులకు జరిగే నష్టం చాలా ఎక్కువని తెలిపారు. చివరకు ఎనిమిది మంది ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి రెండు ప్రాంతాలలో ఏనుగుల గుంపులను తరలించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img