Monday, March 20, 2023
Monday, March 20, 2023

నవరత్నభరిత బడ్జెట్‌

రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,79,279 కోట్లు

. ఓట్ల పథకాలకే ప్రాధాన్యం
. సాగునీటి ప్రాజెక్టులకు నామమాత్రం
. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు
. మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు
. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు
. ద్రవ్య లోటు రూ.54,587 కోట్లుగా అంచనా
. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీ బడ్జెట్‌ 2023-24 వార్షిక సంవత్సరానికి గాను రూ. 2 లక్షల 79 వేల 279 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి పాతపద్దతిని కొనసాగిస్తూ విడిగా ప్రవేశపెట్టారు. తొలుత ఈ రెండు బడ్జెట్‌లను మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గత బడ్జెట్‌ల తరహాలోనే ఈ బడ్జెట్‌ కూడా ఓట్ల ఆకర్షణే లక్ష్యంగా నవరత్నాల పథకాలకే పెద్దపీట వేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు, సాగునీటి ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులు విదిల్చారు. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,28,540 కోట్లుగా, మూల ధన వ్యయం అంచనా రూ.31,061కోట్లుగా, రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లుగా, ద్రవ్య లోటు రూ.54,587కోట్లు అంచనాతో మంత్రి ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవిన్యూలోటు 3.77శాతంగా, ద్రవ్యలోటు 1.54 శాతంగా ఉండవచ్చునని మంత్రి వెల్లడిరచారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో బుగ్గన తన బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం చెప్పినట్లుగా ‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోకుండా చేసేది’ అంటూ ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలతో బడ్జెట్‌ను ముగించారు. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించినట్లు చెప్పారు. రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం తమదని, అందుకే పేదల సంక్షేమ పథకాలతో పాటు, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యనిస్తూ నిధులు కేటాయింపులు చేశామన్నారు. పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించడం వైసీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. సాధికారత పొందిన ప్రజలు, రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పథకంలో నడిపిస్తూ ప్రపంచానికి తమ సత్తాను చాటాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షగా పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతిని గమనించడానికి రాష్ట్ర ప్రభుత్వం 475 సూచికలతో కూడిన రాష్ట్ర ముందస్తు సూచికను అభివృద్ధి చేసింది. నవరత్నాలు సహా అన్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉద్దేశించిన ఫలితాల ఆధారంగా 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానమైనట్లు వివరించారు. ముఖ్యంగా మహిళా సాధికారత మా ప్రభుత్వ విధానంలో ఒక ప్రధాన లక్షణమన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అనేది వికేంద్రీకృత, పౌర కేంద్రీకృత, పారదర్శక పాలన యొక్క విశిష్ట నమూనాగా అభివర్ణించారు. ఈ వ్యవస్థ బలోపేతానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,858 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ సునాయసంగా అధిగమించామన్నారు. విత్తనం నాటే దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం వరకు రైతుకు అండగా నిలుస్తున్న రైతు భరోసా కేంద్రాల పనితీరును వివిధ రాష్ట్రాలతోపాటు, ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకుంటున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రాభివృద్ధిలో పాడి రంగం కీలక పాత్ర పోషిస్తుందని, గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉందన్నారు. మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందన్నారు. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద ఈ ఏడాది చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇది ఒక చరిత్రాత్మక ఘట్టంగా మంత్రి పేర్కొన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులతో పాటు ఆర్థిక వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల పరిపూర్ణ అభివృద్ధి కోసం బీసీలకు 56 కార్పొరేషన్లు, షెడ్యూలు కులాలకు 3, షెడ్యూలు తెగలకు ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం మౌజన్‌లకు నెలకు రూ.5వేలు, ఇమామ్‌లకు రూ.10వేలు, పాస్టర్లకు రూ.5వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తూ, వారిని హజ్‌, జెరూసలేం యాత్రలకు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పంపిస్తున్నట్లు చెప్పారు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాలను, వాటి వల్ల వస్తున్న ఫలితాలను ప్రముఖుల కొటేషన్లతో మంత్రి చదివి వినిపించారు. నాడు`నేడు కార్యక్రమాలతో విద్యా, వైద్యరంగాలను ప్రక్షాళన చేశామని, ఆయా రంగాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపులు చేసినట్లు చెప్పారు. ఆయా రంగాల వారీ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా ఉన్నాయి.
. మొత్తం డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.41,436 కోట్లు
. పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
. పర్యావరణం , అటవీ, శాస్త్ర సాంకేతికత శాఖ రూ. 685 కోట్లు
. ఎనర్జీ రూ.6,456 కోట్లు
. గ్రామ , వార్డు సచివాలయాల శాఖకు రూ.3,858 కోట్లు
. గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
. మన బడి నాడు నేడు రూ.3,500 కోట్లు
. పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
. పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
. రోడ్లు, భవనాలు శాఖ రూ.9,118 కోట్లు
. నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్లు
. ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
. వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
. వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు
. పురపాలక పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు
. షెడ్యూల్‌ తెగల కాంపొనెంట్‌ కోసం రూ.6,929 కోట్లు
. వెనుకబడిన తరగతుల కాంపొనెంట్‌ కోసం రూ.38,605 కోట్లు
. యువజన అభివృద్ధా, పర్యాటకం, సాంస్కృతి శాఖ రూ.1,291 కోట్లు
. షెడ్యూలు కులాల కాంపొనెంట్‌ కోసం రూ.20,005 కోట్లు
. వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు
. పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు
. జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు
. హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు
. గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు
. గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు
. నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు
. పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు
. మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు
. కార్మిక శాఖకు రూ.796 కోట్లు అ ఐటీ శాఖకు రూ.215 కోట్లు
. న్యాయశాఖకు రూ.1058 కోట్లు
. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు
. పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు
. మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు కేటాయింపు
. నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు
. ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు కేటాయింపు
. అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు
. సివిల్‌ సప్లై – రూ. 3725 కోట్లు, జీఏడీకి రూ.1,148 కోట్లు
. పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రూ.1.67 కోట్లు, ప్రణాళిక 809 కోట్లు
. రెవెన్యూ రూ.5380 కోట్లు, రియల్‌ టైం గవర్నెస్‌ రూ.73 కోట్లు
. స్కిల్‌డెవలప్‌మెంట్‌కు రూ. 1167 కోట్లు
. ఆర్‌ అండ్‌ బి కి రూ.9119 కోట్లు కేటాయింపులతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించగా, శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img