Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

నష్టం జరిగిన సీజన్‌లోనే పంట నష్ట పరిహారం

దేశంలో ఎక్కడా ఈ విధానం లేదు
గత రెండున్నరేళ్లలో రూ.1,610 కోట్లు చెల్లించాం
రైతన్నకు అండగా అనేక పథకాలు అమలు
ఇన్‌ఫుట్‌ సబ్సిడీ పంపిణీలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి: ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగానికి అదే సీజన్‌లో నష్టపరిహారం అందజేయడం దేశంలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని, ఈ విషయంలో ఏపీది సరికొత్త రికార్డుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో మంగళవారం సీఎం జగన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేశారు. దీనివల్ల వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటూ 80 శాతం సబ్సిడీతో 1.43 లక్షల మంది రైతులకు విత్తనాలు ఇచ్చామని, ఇప్పటివరకు గత రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ద్వారా రూ.1,612 కోట్లు చెల్లించామని వివరించారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే.. ఆ సీజన్‌లో తోడుగా నిలబడే పరిస్థితి ఎప్పుడూ లేదని, గత ప్రభుత్వంలో కొన్ని సార్లు పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితులున్నాయని ఆయా సందర్భాలను సీఎం వివరించారు. అలాగే కౌలు రైతులను కూడా గత ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. మన ప్రభుత్వంలో మాత్రం శాస్త్రీయంగా, అర్హులెవ్వరూ మిగిలిపోకుండా, ఇ-క్రాప్‌ డేటాతో పంట నష్టాలను అంచనావేసి, ఆర్బీకేల స్థాయిలో అందజేస్తున్నామన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శించి ఏ సీజన్‌లో జరిగిన పంటనష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగానే పరిహారాన్ని రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు. అలాగే అన్నదాతల మేలు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ ద్వారా అరకోటి మంది రైతన్నల కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.19,126 కోట్లు ఇచ్చామని, పంట రుణాలపై సున్నా వడ్డీ కింద పూర్తి వడ్డీ రాయితీని 65.64 లక్షల మంది రైతులకు రూ.1,218 కోట్లు ఇచ్చామని తెలిపారు. అలాగే 18.7 లక్షల మంది రైతులన్నలకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వడానికి ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఉచిత పంట బీమా ద్వారా 31.07 వేల మంది రైతులకు 3,788 కోట్ల రూపాయలు అందజేశామన్నారు. మరోపక్క రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేయడంతోపాటు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు, వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుండి ఆప్కాబ్‌ వరకూ అన్నింటినీ ఆధునీకరణ, జలకళ, ఏపీ అమూల్‌ ద్వారా పాడి రైతులకు చేయూత వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎం.శంకర నారాయణ, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img