Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

‘నాటు నాటు’పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

మోదీ, జగన్‌, చంద్రబాబు అభినందనలు

ముంబై: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సొంతం చేసుకుంది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగానికిగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కారం లభించింది. ఈ మేరకు బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్‌ హాల్‌ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. ‘నాటు నాటు’కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్‌, రాజమౌళి, చరణ్‌.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఈ వీడియోలు నెట్టింట సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ పాటను చంద్రబోస్‌ రచించగా ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య దర్శకుడిగా పనిచేశారు. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజులను ఉద్దేశిస్తూ కల్పిత కథగా ఇది రూపుదిద్దుకుంది. యాక్షన్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు అంతటా మంచి ఆదరణ లభించింది. విదేశీయులను సైతం ఈ పాట ఉర్రూతలూగించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడంపై ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సహా రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తెలుగు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు.
నా శ్రమను, మద్దతిచ్చినవారిని నమ్ముకున్నా: కీరవాణి
అవార్డు తీసుకున్న అనంతరం కీరవాణి మాట్లాడుతూ ‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందించిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు. సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం సంతోషం. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి. పాటలో భాగస్వామ్యమైన రాహుల్‌ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ అద్భుత సహకారం అందించాడు’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img