Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

నాడు`నేడుతో స్కూళ్లు కళకళ

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు, వసతులు పెంచాలి
విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: నాడునేడు, నూతన విద్యా విధానం అమలు ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దానికనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం స్కూళ్ల మ్యాపింగ్‌, జగనన్న విద్యాకానుక, నాడు -నేడు రెండో దశ, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, టాయిలెట్ల నిర్వహణ, స్వేచ్ఛ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. నాడు-నేడు తర్వాత పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు అదనపు వసతుల కల్పన, స్కూళ్లలో ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణ, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది అంశాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు వీటిపై తీసుకున్న చర్యలపై తనకు నివేదించాలని ఆదేశించారు. నూతన విద్యావిధానం ప్రకారం ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేశామనీ, మిగిలిన స్కూళ్ల మ్యాపింగ్‌పై ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. ఆ మేరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలు, ఇతరత్రా అవసరాలను గుర్తించి వారిని నియమించాలని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుని సమర్థంగా అమలు చేయాలన్నారు. పిల్లలకు మంచి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలతో ముందుకెళ్లాలని సీఎం వారికి మార్గనిర్దేశనం చేశారు. ముఖ్యంగా ఇంగ్లీషులో పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్‌ను బాగా వినియోగించుకునేలా చూడాలని, జిల్లా అధికారులు నిరంతరం స్కూళ్లను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టిపెట్టాలని, ఇంట్లో మనం తినే తిండి ఎంత శుచిగా ఉండాలనుకుంటామో, టాయిలెట్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలనుకుంటామో… స్కూళ్లలో వండే ఆహారం అంతే నాణ్యతగా, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల అనేది అందరిదీ అనే భావన రావాలని, ఇందుకోసం అంగన్‌వాడీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్‌ క్లినిక్స్‌ దృష్టిపెట్టాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (మిడ్‌ డే మీల్స్‌) డైరెక్టర్‌ బీ ఎం దివాన్‌, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ, సర్వశిక్షాఅభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి రాములు, కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బి ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img