Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

నారాయణకు వేధింపులు

. మియామి విమానాశ్రయంలో నిలిపివేత
. మూడు గంటల విచారణ

క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్‌ డియాజ్‌ క్యానెల్‌తో నారాయణ

విజయవాడ: క్యూబాలో జరిగిన ‘అంతర్జాతీయ కమ్యూనిస్టు, కార్మికుల సదస్సు’కు హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణను మియామి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వేధింపులకు గురిచేశారు. సదస్సు అనంతరం హవానా నుంచి పెరూ వెళుతుండగా మధ్యలో ఆ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నారు. పెరూలో గల తన మనవడిని చూడటానికి నారాయణ వెళుతున్నారు. మూడు గంటలకు పైగా వివిధ ప్రశ్నలతో నారాయణను అధికారులు వేధించారు. దీంతో పెరూకు వెళ్లే విమానం మిస్సయింది. ఆరు గంటలకు పైగా మరో విమానం కోసం ఆయన ఎదురుచూడాల్సి వచ్చింది. విచారణ అనంతరం పెరూ వెళ్లడానికి అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై నారాయణ వీడియో ద్వారా తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే…
క్యుబా అంటే అమెరికాకు ఉలుకు
అక్టోబరు 26`29 తేదీల్లో 22వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల సమావేశం క్యూబా రాజధాని హవానాలోజరిగింది. ఆ సమావేశానికి సీపీఐ నుండి నేను హాజరయ్యాను. సమావేశాలనంతరం హవానా నుండి పెరూ(దక్షిణ అమెరికా)కు ఫ్లోరిడా మీదుగా వెళ్లాలి. అయితే ఫ్లోరిడాలో ఇమ్మిగ్రేషన్‌ తనిఖీ ఉంటుంది. ఆ సంద ర్బం ఓ అధికారి నా పాస్‌పోర్ట్‌ చూడగనే నన్ను సెక్యూరిటీకి అప్పగించారు. నన్ను ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి ఫోన్‌ తీసుకున్నారు. గంటతర్వాత మరో అధికారి వచ్చి నా పూర్వా పరాలు అడిగారు. దీనికి ముందు నా ఫోన్‌లో అంశాలన్నీ పరిశీలించినట్టు అర్థమైంది. మీరు కమ్యూనిస్టులు…హవానా సభలో మీరు, ఆ దేశ అధ్యక్షుడు, కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిని కలిసినట్టు ఫొటో చెబుతుంది. మీరు వారితో ఏమి మాట్లాడారో వివరాలు చెప్పమని అడిగారు. మా మధ్య పార్టీ అనుబంధాలు తప్ప ఇంకేమీ ఉండవు. మర్యాదపూర్వకంగా కలిసి సెల్ఫీలు తీసుకున్నాం. వారు కూడా కామ్రేడ్లీగా ఆత్మీయతను వ్యక్తపరుస్తూ ఫొటోలు తీసుకున్నామని చెప్పాను. అయినా మీ మధ్య ఎలాంటి చర్చ జరిగింది? అంటూ అధికారి పదేపదే ప్రశ్నించారు. సహజంగా నాకు కూడా విసుగొచ్చింది. నేనేమీ టెర్రరిస్టును కాదు…చట్టబద్ధంగా 50 ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నాను. క్యూబా కమ్యూనిస్టు పార్టీ కూడా చట్టబద్ధంగానే పనిచేస్తుందిగా…అంతా పారదర్శకమే కదా… మరి మీ అనుమానాలేమిటి? అని ఎదురు ప్రశ్నించారు. మాకు కూడా తెలుసు. నేను కూడా క్యూబా జాతీయుడనే. అయితే కమ్యూనిజమంటే పడద న్నారు. అందుకేనా నన్ను విచారించిందని అడిగాను. మా బాస్‌తో కూడా మాట్లాడుతావా అంటూ మరో అధికారిని చూపించారు. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని అంటుండగానే…ఆయన నేను కూడా క్యూబావాసినే అని చెప్పారు. అనవసరంగా మూడు గంటలు నన్ను ఆపి… నా విమానం అందుకోకుండా చేశారు… ఇప్పుడు నా ప్రయాణం సంగతేమిటని అడిగాను. దీనికి అధికారులు స్పందిస్తూ మీ లగేజీ భద్రంగానే వుంది. మరో విమానానికి టికెట్‌ తీసి ఇస్తామన్నారు. దాదాపు ఆరు గంటలు ఫ్లోరిడా విమానాశ్రయంలో కాలం గడుపాల్సి వచ్చింది. కూతవేటు(90 మైళ్లు) దూరంలో ఉన్న క్యూబా అంటే అమెరికాకు భయమా లేక ఈర్ష్యా అని నారాయణ అనుమానం వ్యక్తంచేశారు. భారతదేశంలోనే కాకుండా అమెరికాలోనూ పోలీసు విచారణకు గురికావడం గర్వకారణమే కదా! అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రశాంతంగా పెరూ చేరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img