Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

నాసిరకం పనులపై విచారణ

. పోలవరం ప్రాజెక్టుపై రామకృష్ణ డిమాండ్‌
. దిల్లీ పర్యటన వివరాలు వెల్లడిరచాలని హితవు

విశాలాంధ్ర – విజయవాడ : పోలవరం ఇప్పుడే పూర్తికాదనే స్థితికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని, అందువల్ల కేంద్రమే బాధ్యత తీసుకుని పోలవరాన్ని పూర్తి చేయాలని, నాసిరకం పనులపై సమగ్ర విచారణ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. విజయవాడ దాసరి భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ పోలవరాన్ని 2020 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని ఒకసారి, 2020 డిసెంబర్‌ నాటికని మరోసారి, 2021 ఖరీఫ్‌ నాటికి నీరిస్తామని మరోసారి నాటి రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ ప్రకటనతో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పోలవరం నిర్మాణంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇది రాజకీయ నాయకులు చెపుతున్న మాటలు కాదని, పోలవరం ప్రాజెక్టులో పనిచేసే అధికారులు, ఇంజినీర్లు చెపుతున్నారన్నారు. డయాఫ్రం వాల్‌, కాఫర్‌ డ్యామ్‌ దెబ్బతిన్నాయని, గైడ్‌బండ్‌ కుంగిదని రామకృష్ణ చెప్పారు. నాసిరకం పనులు వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. రివర్స్‌ టెండర్ల వల్ల ఎక్కువగా నష్టం జరిగిందన్నారు. పోలవరం పనులపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏడాదికి 10,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ఉంటే పోలవరం పూర్తయ్యేదని, పునరావాసం, నిర్వాసితులకు ఉపాధి లభించేదన్నారు. జాతీయ ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేశారని విమర్శించారు. పూర్తిస్థాయిలో కేంద్రం బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.
అదానీ, అమూల్‌ ఏజెంట్‌ జగన్‌
సీఎం జగన్‌ విజయ డెయిరీని చంపి అమూల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని, అదానీ వద్దే స్మార్ట్‌ మీటర్లు కొంటున్నారని చెప్పారు. గుజరాత్‌ అంటే జగన్‌కు ప్రేమ ఎక్కువైందని, అదానీ, అమూల్‌కు ఏజెంట్‌గా సీఎం పనిచేస్తూ ఆస్తులు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. అమూల్‌ డెయిరీని కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, ప్రజలు తిరస్కరించారని తెలిపారు. విజయ డెయిరీ ఆస్తులను అమూల్‌కు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్ల విషయంలో చండీగఢ్‌లో రూ.7100, రాజస్తాన్‌లో రూ.7,900 ఉంటే ఏపీలో మాత్రం ఏకంగా రూ.36,970 చెల్లిస్తున్నారని చెప్పారు. స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి సీపీఐ మద్దతు ప్రకటిస్తుందన్నారు.
దిల్లీ పర్యటన వివరాలు వెల్లడిరచాలి
దిల్లీ వెళ్లిన సీఎం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. తన మేలు కోసం, కేసుల కోసం, అవినాశ్‌రెడ్డిని కాపాడటం కోసమే వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ప్రధాని, కేంద్రమంత్రులను కలిస్తే… ఆ చర్చల సారాంశం జగన్‌ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. గతంలో సీఎంలుగా పని చేసిన వారు దిల్లీ విశేషాలను మీడియా సాక్షిగా ప్రజలకు వివరించేవారన్నారు. కేంద్రం ఏపీకి అన్నివిధాలా అన్యాయం చేస్తున్నా ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. దిల్లీలో ఎవరిని కలిశారు… ఏఏ అంశాలు చర్చించారు… వారు ఎలా స్పందించారు… కేంద్ర మంత్రుల స్పందనపై సీఎం ప్రతిస్పందన ఏమిటో ప్రజలకు తెలియాలని డిమాండ్‌ చేశారు. లేదంటే జగన్‌ తన కేసుల కోసమే దిల్లీ వెళుతున్నట్లు నమ్మాల్సి ఉంటుందన్నారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రామకృష్ణ సమాధానం ఇస్తూ సోము వీర్రాజుపై అనేక ఆరోపణలు వచ్చాయని, వైసీపీకి అనుకూలంగా పని చేశారనే భావన బీజేపీకి ఉందన్నారు. అందుకే ఆయన్ని తప్పించి పురందరేశ్వరికి బీజేపీ పగ్గాలు ఇచ్చినట్లు భావిస్తున్నానన్నారు. పురందరేశ్వరికి పగ్గాలు అప్పగించినా బీజేపీ బలం పెరగదన్నారు. సీఎం జగన్‌కు బీజేపీ పెద్దల అండ పుష్కలంగా ఉందని, ఆయన అడిగినప్పుడు నిధులు ఇస్తారు…బెయిల్‌ ఇస్తారన్నారు. పొత్తుల విషయంలో ఎవరి అంచనాలు వారివన్నారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని తాను అనుకోవడం లేదన్నారు.
సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, అక్కినేని వనజ, కేవీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img