Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

నిన్న వాతలు… నేడు కోతలు

. ఎండల తీవ్రతతో పతాకస్థాయికి విద్యుత్‌ వినియోగం
. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక అనధికార కోతలు
. ముందస్తు అంచనా ఉన్నా జాగ్రత్త పడని యంత్రాంగం
. ఎడాపెడా కోతలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటివరకు భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలకు వాతలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు వేసవి డిమాండ్‌కనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయలేక అనధికార కోతలు విధిస్తూ ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. అసలే గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదు అవుతుండడం, దీనికితోడు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో కరెంట్‌ కోతలు వినియోగదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. వాస్తవానికి కొన్ని నెలల తర్వాత రాబోయే విద్యుత్‌ డిమాండ్‌ను సాంకేతికత ఆధారంగా అంచనా వేసే వ్యవస్థను రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు అభివృద్ధి చేశాయి. దాని ఆధారంగా వేసవి కాలంలో గరిష్ఠంగా విద్యుత్‌ డిమాండ్‌ 250 మిలియన్‌ యూనిట్లు దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే మే నెలలో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గుతుందని భావించారు. దానికనుగుణంగా 230 ఎంయూల విద్యుత్‌ సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందించారు. కానీ వ్యవసాయ విద్యుత్‌ వాడకం తగ్గినప్పటికీ అంచనాలను దాటి రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం 256 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. ఈ నెల 10వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తీవ్రం కావడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. 10వ తేదీ 218.34 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉండగా, తర్వాత రోజురోజుకూ పెరుగుతూ ప్రస్తుతం 255 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. ఆ మేరకు సరఫరా చేయలేక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమయాల్లో అనధికార విద్యుత్‌ కోతలు అమలు చేస్తోంది. వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ను ముందుగా అంచనా వేసి కూడా దానికనుగుణంగా ముందస్తు చర్యలు పటిష్టవంతంగా చేపట్టకపోవడం ప్రస్తుత కోతలకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల దగ్గర తగినంత బొగ్గు నిల్వలను ఇప్పటికీ సమకూర్చుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలోని కృష్ణపట్నం, ఆర్టీటీపీపీ, వీటీపీఎస్‌, హిందూజా, జల విద్యుత్‌, గ్యాస్‌, పవన, సౌర విద్యుత్‌లన్నీ కలిపి 19,239 మెగావాట్ల ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా, కేవలం 6,205 మెగావాట్లు మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. కృష్ణపట్నం 2,400 మెగావాట్లకు గాను 1,400, ఆర్‌టీపీపీ 1,650 మెగావాట్లకు గాను 1,356, వీటీపీఎస్‌ 1,760కి గాను 1,073 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుండగా, జల విద్యుత్‌ 1,901 మెగావాట్లకు గాను 261 మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇక గ్యాస్‌, సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి అంచనాలకు పూర్తి విరుద్ధంగా మొత్తం 10,488 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి గాను కేవలం 1,631 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. దీంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం రోజుకి 45 మిలియన్‌ యూనిట్లకు పైగా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ డిమాండ్‌కు తగ్గ విద్యుత్‌ను సరఫరా చేయలేక దాదాపు 8 మిలియన్‌ యూనిట్ల మేర అనధికార కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో అనేక ప్రాంతాల్లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో పాటు వడగాడ్పులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఫ్యాన్‌, ఏసీ పని చేయని ఇల్లు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్‌ కోతలు అమలు చేస్తుండడంతో జనం అల్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరుతో రాత్రుల పూట కూడా కరెంట్‌ తీస్తున్నారు.
ఒకపక్క ఉక్కపోత, మరోపక్క దోమల బెడదతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. విద్యుత్‌ అధికారులు మాత్రం ఈ కోతలకు సాంకేతిక సమస్యలే కారణం తప్ప అధికారికంగా ఎటువంటి కోతలు విధించడం లేదని చెపుతున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా వాస్తవ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేసేలా తక్షణ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img