Monday, March 20, 2023
Monday, March 20, 2023

నిరుద్యోగ ఉత్పాతం

. దేశంలో తారస్థాయికి ఉపాధిలేమి
. పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి
. 41 నెలలుగా ఇదే దుస్థితి
. చిన్న పరిశ్రమల బలోపేతానికి కొరవడిన చర్యలు
. ‘ఉపాధి’కి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించిన కేంద్రం

న్యూదిల్లీ: దేశంలో నిరుద్యోగం తారస్థాయికి చేరింది. ఫలితంగా ఆదాయ లేమితో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. 41 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ‘ఉపాధి’కి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించిన కేంద్రం… కార్పొరేట్లకు మాత్రం సంపదను దోచిపెట్టే పనిని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చిన దాఖలాలూ లేవు. దీంతో యువత ఉద్యోగాలు లేక నిరాశలో కూరుకుపోతున్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని అటకెక్కించిన బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్లకు మాత్రం దేశ సంపదను దోచిపెడుతోంది. దీంతో కార్పొరేట్లు బిలియన్‌ డాలర్లకు ఎగబాకుతున్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవటంతో ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేక దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది.
ఉద్యోగాలు పెరగడం లేదు
సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) సర్వే ప్రకారం… గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉండగా, పట్టణాల్లో 8-10 శాతం ఉన్నది. గత 41 నెలలుగా నిరుద్యోగిత రేటులో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. మరోవైపు కరోనా సంక్షోభానికి ముందు 2020 జనవరిలో దేశంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 41.1 కోట్లు ఉండగా, 2023కు ఆ సంఖ్య 40.9 కోట్లకు తగ్గింది. కార్మిక భాగస్వామ్య రేటు 42.9 నుంచి 39.8 శాతానికి పడిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరగటం లేదనేది ఇక్కడ స్పష్టమవుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
బడ్జెట్‌లో ఉపాధి రంగాలకు కోత
2023-24 బడ్జెట్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 33 శాతం నిధుల కోత పెట్టడం దారుణంగా ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2022-23లో ఉపాధిహామీ పథకానికి రూ.89,400 కోట్లు ఖర్చు కాగా, కొత్త బడ్జెట్‌లో రూ.60 వేల కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది. జాతీయ జీవనోపాధి మిషన్‌కు కూడా కేటాయింపులు తగ్గాయి. గ్రామీణ గృహ నిర్మాణ పథకం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, ఇతర సంక్షేమ రంగాలకు కేటాయింపుల్లో కోత విధించటంతో ఆయా రంగాలలో కూడా ఉద్యోగావకాశాలు పడిపోనున్నాయి. ఐసీడీఎస్‌కు నిధులు పెంచకపోవడంతో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించిన 2.4 లక్షల ఖాళీలు కూడా భర్తీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తయారీ రంగాలకు దెబ్బ
విదేశీ యంత్రాల దిగుమతులకు కేంద్రం ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో స్థానిక ఉద్యోగాల కల్పన, దేశీయ తయారీ రంగాలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అప్పులు పొందే విధానాన్ని సరళీకృతం చేస్తే ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. కానీ బీజేపీ పాలనలో ప్రస్తుతం వ్యవస్థలో అమలవుతున్న కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, రుణ సదుపాయం పెంచడం వంటి చర్యలు ఉద్యోగాలు పెంచడానికి దోహదం పడటం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇటువంటి చర్యల వల్ల కరోనా ప్రభావం ఉన్న రెండేళ్లలో లిస్టెడ్‌ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించినట్టు గణాంకాలు వివరిస్తున్నాయి.
మందగించిన ఆర్థిక కార్యకలాపాలు
నిరుద్యోగం, ఆదాయ లేమితో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, కోవిడ్‌ సంక్షోభంతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) తీవ్రంగా నష్టపోయాయి. వీటికి వెన్నుదన్నుగా నిలవాల్సిన కేంద్రం బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకొంటున్నది. దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి, నిరుద్యోగం తగ్గాలంటే కేంద్రం ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img