. పోలవరానికి నిధులివ్వని కేంద్రం
. బీజేపీ గెలుపు కోసం ఎగువభద్రకు నిధులు
. రామకృష్ణ విమర్శ
. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు సందర్శించిన సీపీఐ బృందం
విశాలాంధ్ర`విజయనగరం/గుర్ల: వెనుకబడిన ప్రాంతాలు, రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనడానికి తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టే నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్టవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లాలో తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును సీపీఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా మోదీ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2900 కోట్లు కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం వివాదాస్పద ఎగువభద్ర ప్రాజెక్టుకు మోదీ ప్రభుత్వం రూ.5300 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. అదే సమయంలో జాతీయ ప్రాజెక్టు పోలవరానికి మాత్రం నిధులివ్వడం లేదన్నారు.
రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తెలిసినా ఎగువ భద్రకు నిధులిచ్చారన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని పదేపదే చెప్పే పాలకులు రూ.739 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు ఎందుకు నిధులివ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 49 గ్రామాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందుతుందన్నారు.
ఇంతటి ప్రాధాన్యత గల ప్రాజెక్టుకు నిధులివ్వకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులు, రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. తారకరామా ప్రాజెక్టుకు సంబంధించి రూ.90 కోట్లతో మూడు ముంపు గ్రామాల బాధితులకు పునరావాసం కల్పించవచ్చన్నారు. పోలవరం నిర్వాసితులకు రూ.29 వేల కోట్లివ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రమంటూ మాట్లాడే మంత్రి ధర్మాన ప్రసాదరావు వెనుకబడిన ప్రాంతాల్లో ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు సందర్శించి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. ప్రాజెక్టులపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ముందుగా తారకరామ ప్రాజెక్టు స్థితిగతులను, పురోగతిని ప్రాజెక్టు డీఈ రమణ రామకృష్ణకు వివరించారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, ఈశ్వరయ్య, అక్కినేని వనజ, డేగా ప్రభాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు ఎ.విమల, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్సులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, ఎన్.నాగభూషణం, బాయి రమణమ్మ, బుగత పావని, జిల్లా సమితి సభ్యులు పొందూరు అప్పలరాజు, పురం అప్పారావు, డేగల అప్పలరాజు, ఎస్.సునీల్, కె.స్రవంతి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్సులు బి.రవికుమార్, పి.గౌరీశంకర్, అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మజ్జి సూరప్పడు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.