Monday, March 20, 2023
Monday, March 20, 2023

నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

. రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలి
. పోలవరంపై దిల్లీకి ప్రతినిధుల బృందం
. కేంద్ర, రాష్ట్రాల దగా : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. ఐక్యపోరాటాలే శరణ్యం: రైతు సంఘాల ప్రతినిధులు
. నీటి పారుదల ప్రాజెక్టులపై సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరితో వాటిని గాలికొదిలేశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సీఎం వైఎస్‌ జగన్‌ మేల్కొని రాబోయే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులకు 15 శాతం నిధులు కేటాయించాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేశారు. ఏపీ బడ్జెట్‌ సమావేశాలు రానున్న దృష్ట్యా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులుబడ్జెట్‌ కేటాయింపులపై ఆదివారం విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. దీనికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, నీటిపారుదల రంగ నిపుణులు హాజరై... సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత విధానాలను ఎండగట్టారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రామకృష్ణ మాట్లాడుతూ నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై సీపీఐ రాష్ట్ర బృందం ఈనెల 13 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలించిందని గుర్తుచేశారు. ఆయా ప్రాజెక్టులలో జరిగిన పనులు, ఇంకా చేపట్టాల్సినవి, నిర్వాసితుల సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, సాచివేత ధోరణి తదితర సమస్యలు తమ బృందం దృష్టికి వచ్చాయని వివరించారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్రంతో పాటు కేంద్రమూ తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. దీంతో పోలవరంపై దిల్లీకి ప్రతినిధుల బృందం వెళ్లి, అక్కడ కూడా కేంద్రంపై ఐక్యంగా ఒత్తిడి తేవాలని నొక్కి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి పదేపదే అన్యాయం చేస్తున్నాయని, సాగునీటి రంగంపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయని మండిపడ్డారు. జగన్‌ తీవ్ర వైఫల్యం: ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ మంచి నదుల సమ్మేళనమని అభివర్ణించారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం, పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను జగన్‌ సర్కారు నిర్లక్ష్యం చేసిందన్నారు. పురుషోత్తమపట్నం, పట్టిసీమ పనులు బూజు పట్టాయని తెలిపారు. జగన్‌ సీఎం హోదాలో చేసిన మొదటి సమీక్షలోనే ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు సూచించినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టారన్నారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ మరమ్మతులపై ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నీటిపారుదల రంగాభివృద్ధికి ఇప్పటివరకు జగన్‌ ఏం చేశారంటూ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్టులను గాలికొదిలేశారన్నారు. అత్యధికంగా వైసీపీ ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏం మేలు జరగలేదని, దిల్లీలో వారేం చేస్తున్నారని నిలదీశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన పనుల బిల్లులనూ తెచ్చుకోలేక పోయారని, ప్రాజెక్టులపై ఘోరంగా నిర్లక్ష్యం చూపారన్నారు. పోలవరం ప్రాజెక్టును సైతం పోలవరం డ్యామ్‌ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పోలవరంపై దిల్లీ కేంద్రంగా త్వరలో జరిగే సమావేశానికి అఖిలపక్ష రైతు సంఘాలు, పార్టీల నేతలు తరలిరావాలన్నారు. తొలుత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై సీపీఐ నాయకత్వం పరిశీలన యాత్రలో వెలుగు చూసిన అంశాలను సంక్షిప్తంగా వివరించారు. రాష్ట్ర ప్రాజెక్టులను ఐదు విభాగాలుగా విభజించి పరిశీలించామన్నారు. తుంగభద్ర డ్యామ్‌ ఎగువ భద్ర ప్రమాదం, కృష్ణానదిపై ఉన్న గాలేరునగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, హంద్రినీవా, వెలిగొండ, పోలవరం, వంశధార, తోటపల్లి, తారకరామ తీర్థ తదితర ప్రాజెక్టులను పరిశీలించి అనేక సమస్యలను గుర్తించామన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దశలవారీ పోరాటాలు చేయాలన్నారు.
అన్నమయ్య, ఫించా నిర్వహణ లోపం: తులసిరెడ్డి
కాంగ్రెస్‌ నాయకులు ఎన్‌.తులసిరెడ్డి మాట్లాడుతూ గోదావరి, కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల స్థితిగతులపై ఆయన రేఖాంశాలతో సహా సమగ్రంగా వివరించారు. సీఎం జగన్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదని మండిపడ్డారు. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు నిర్వహణా లోపం వల్లనే కొట్టుకుపోయాయని వివరించారు. గత ప్రభుత్వాలు బడ్జెట్‌లలో 15 నుంచి 17 శాతం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించగా, జగన్‌ ప్రభుత్వం మాత్రం కేవలం 5 శాతంలోపే కేటాయించడం దుర్మార్గమన్నారు. రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులకు 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి: బాబూరావు
ఏపీ ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుదారుల సదస్సుతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై కూడా సదస్సు పెడితే బాగుండేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు సూచించారు. ఏపీ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం చేస్తున్న ద్రోహంపై నిలదీయాలని, ప్రాజెక్టుల శాశ్వత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘ ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టుల సాధనలో కమ్యూనిస్టుల ఉద్యమం ఎనలేనిదని కొనియాడారు. దిల్లీ కేంద్రంగా పోలవరంపై ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు యెర్నేని నాగేంద్రనాథ్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును కాస్తా పోలవరం డ్యామ్‌గా మార్చారంటూ ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రభుత్వం ఉన్నంత వరకు పోలవరం పూర్తి కాబోదన్నారు. ప్రముఖ విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల పైనా జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి మోదీ, జగన్‌ ఎవరంటూ మండిపడ్డారు. సాగునీటిదారుల సంఘం అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలన్నారు. నల్లమల్ల రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ను పొడిగించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు సుధీర్‌ మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు వచ్చినా సాగునీటి పారుదల రంగంపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయని విమర్శించారు. వివిధ రైతు సంఘాల నాయకులు తోట ఆంజనేయులు, కొలనుకొండ శివాజీ, పువ్వాడ సుధాకర్‌, వై.కేశవరావు మాట్లాడుతూ సమైక్య పోరాటాలతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, డేగా ప్రభాకర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, ఆర్‌.రవీంద్రనాథ్‌, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, కార్యదర్శులు మల్నీడు యలమందరావు, పి.జమలయ్య, సీపీఐ ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లా కార్యదర్శులు సిహెచ్‌.కోటేశ్వరరావు, ఎం.ఎల్‌.నారాయణ, నాయకులు అక్కినేని చంద్రరావు, కాంగ్రెస్‌ విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, నాయకులు గుర్నాథం, లోక్‌సత్తా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.బాబు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతాంగ నేతలు, విశ్లేషకులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్‌ అభ్యుదయ గీతాలను ఆలపించారు. దాసరి భవన్‌లో సాగునీటి రంగ ప్రాజెక్టుల స్థితిగతులపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను నేతలు తిలకించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img