పవన్ తీరుపై చిరంజీవి విచారం
ఆన్‌లైన్ టికెట్‌తో నీ ఇబ్బంది ఏంటి
పవన్‌పై మంత్రి పేర్ని నాని మండిపాటు
నిర్మాతల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా
విశాలాంధ్ర ` మచిలీపట్నం : భారతదేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో తెలుగు చిత్ర నిర్మాతల బృందంతో సమావేశమైన అనంతరం మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. షామియానా షాపులో వస్తువులు అద్దెకు ఇస్తారని, సినిమా పరిశ్రమలో క్యారవాన్, ఔట్‌డోర్ వ్యాన్‌లు అద్దెకిస్తారని, కానీ రాజకీయ పార్టీని అద్దెకు ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. సినీ నిర్మాతలు సినీ పరిశ్రమలోని ఇబ్బందులు, కష్టాలు తెలిపారని, వారి చెప్పిన ప్రతి సమస్యను, అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలతో తాము ఏకీభవించటం లేదని నిర్మాతలు తెలిపారన్నారు. ఒక నటునిపై కోపంతో సినీ పరిశ్రమకు నష్టం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం ఎప్పటి నుంచో అమలులో ఉందని, దానిని సినీ పరిశ్రమలో పెద్దలు అందరు ఏకగ్రీవంగా కోరుకుంటున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌పై చిరంజీవి తనకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారని, పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు అందరి అభిప్రాయాలుగా భావించవద్దని కోరారన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సహకారంతో యాప్‌ను రూపొందించి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధ్వర్యంలో నిర్వహించే ఆలోచన ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌పై బూతు పదాలు వాడటంపై ప్రశ్నించగా తాను ఏమి బూతులు మాట్లాడానో చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏరా, ఒరే అనే సంస్కారం అంజనాదేవి నేర్పిందా అని ప్రశ్నించారు. నేను రెడ్లకు పాలేరునైతే పవన్ కమ్మవాళ్లకు పాలేరు అన్నారు. తనను అవమానించాలని చూస్తే ఆ అవమానాన్ని పరిచయం చేస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ గతంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలసి ముఖ్యమంత్రిని కలిశామన్నారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, సమస్యలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వకీల్‌సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయని, దయచేసి అందరూ మమ్మల్ని వివాదాలకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున తామే ప్రభుత్వాన్ని కోరామని, ఆన్‌లైన్ విధానంలో పారదర్శకత ఉంటుందన్నారు. సమావేశంలో చిత్ర నిర్మాతలు దిల్‌రాజు, డి.వి.వి. దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి తదితర నిర్మాతల బృందం పాల్గొన్నారు.