Friday, March 24, 2023
Friday, March 24, 2023

నెల్లూరులో వైసీపీకి షాక్‌

ఆనం, కోటంరెడ్డి ధిక్కారం


. జగన్‌ సర్కారుపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు
. టీడీపీ వైపు చూపు
. నేడు సీఎం దగ్గర పంచాయితీ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : వైసీపీ కంచుకోట నెలూర్లు జిల్లాలో బీటలు వారుతున్నాయా? ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ధిక్కార స్వరం వినిపించడం, ఏకంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని చెప్పడం సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెలూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీపై తిరుగుబాటు చేశారు. ఆ ఇద్దరూ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ను రహస్యంగా కలిసి ఒప్పందానికి వచ్చినట్లు వైసీపీ అనుమానిస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దీంతో ఆయన నియోజకవర్గంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ అధిష్ఠానంపై బహిరంగ విమర్శలు చేశారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. లోకేశ్‌ పాదయాత్ర నెల్లూరు వచ్చే నాటికి వారిద్దరూ వైసీపీకి రాజీనామా చేసి…టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారముంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్‌ ప్రభుత్వంపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేస్తున్నారు. తన గన్‌మెన్లను తొలగించారని, తనకు ప్రాణహాని ఉందని ఆనం అంటున్నారు. కాగా, వైసీపీ ఆవిర్భావం నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జగన్‌ వెంటే ఉన్నారు. జగన్‌కు తోడుగా నెల్లూరులో పార్టీ బలోపేతానికి కృషిచేశారు. సామాన్యకార్యకర్తగా ఉన్న శ్రీధర్‌రెడ్డి…ఏకంగా వైసీపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అప్పటి నుంచి అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు. సీఎం జగన్‌ ఆదేశించిన గడపగడపకు కార్యక్రమాన్ని సైతం సక్రమంగా పూర్తి చేయలేదు. నియోజకవర్గాల పర్యటనల్లో శ్రీధర్‌రెడ్డి వెనుకబాటుకు గురవ్వడంతో చాలాసార్లు జగన్‌ నుంచి ఆదేశాలు వెళ్లినా ఆయన ఖాతరు చేయలేదు. పనితీరు మార్చుకోవాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని సీఎం జగన్‌ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓవైపు అసంతృప్తి, మరోవైపు సొంత జిల్లాలో సీనియర్ల నుంచి సహకారం లేకపోవడం ఆయనను కలవర పెట్టింది.
హుటాహుటిన నెల్లూరుకు బాలినేని
శ్రీధర్‌రెడ్డి పార్టీ మార్పు ప్రచారంతో నెల్లూరులోని ముఖ్యనేతలతో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హుటాహుటిన నెల్లూరు చేరుకున్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యారు. అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలినేని విలేకరులతో మాట్లాడుతూ కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని చెప్పారు. అయితే జగన్‌ ప్రభుత్వంపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. కోటంరెడ్డి అన్నదమ్ముల మధ్య తామేమీ పంచాయితీ పెట్టలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరులోని 10 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని, బుధవారం సీఎం జగన్‌ దగ్గర నెల్లూరు పంచాయితీ పెడతామని, అధినేత ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. నెల్లూరు రూరల్‌కు సమన్వయకర్తను నియమిస్తామంటూ బాలినేని ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆధిష్టానం దిగిరాలేదనేదీ స్పష్టమవుతోంది. ఇతర జిల్లాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇటీవల మీడియా సాక్షిగా అసంతృప్తి వ్యక్తంచేశారు. తన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా పార్టీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడంపై ఆమె రగిలిపోతున్నారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కకపోవడంపైనా ఆగ్రహం వెలిబుచ్చిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img